హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. భారత్ తాలిబన్లతో చర్చలు జరపాలని సూచించారు. దీనిపై స్పందించిన విజయశాంతి దీటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తాలిబన్లతో మీరే చర్చలు జరిపి రండి’’ అని సమాధానం ఇచ్చారు. ‘‘భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది.’’ అని విజయశాంతి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 










కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెండ్రోజుల కిందట స్పందించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు దురాక్రమించుకున్న వేళ ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం అవలంబించబోయే వైఖరిని వెల్లడించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అఫ్గానిస్థాన్‌లో భారత ప్రభుత్వం 3 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి పార్లమెంటు భవనం, ఓ రిజర్వాయర్ కూడా నిర్మించిందని ఒవైసీ గుర్తు చేశారు. తాజాగా తాలిబన్ల దురాక్రమణతో భారత్ అక్కడ చేసిన అభివృద్ధి అంతా వృథా అయిపోయిందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ విషయంలో భారత ప్రభుత్వం గతంలోనే స్పందించాల్సి ఉందని ఒవైసీ అన్నారు. 


అల్‌ఖైదా, ఐసీస్ ముఖ్య స్థావరాలను అఫ్గానిస్థాన్‌కు మార్చారని, ఈ విషయంలో మోదీ ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. తాలిబన్లు, జైష్-ఎ-మహ్మద్, అల్‌-ఖాయిదా గురించి భారత ప్రభుత్వానికి తెలిసినప్పటికీ అఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చిందో మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. 


మళ్లీ ఇదే అంశంపై ఒవైసీ బుధవారం స్పందిస్తూ.. తాలిబన్లను భారత ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా కనీసం వారితో చర్చలకు లాంఛనంగా మార్గాలను తెరిచి ఉంచాలని ఒవైసీ వరుస ట్వీట్లు చేశారు. మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని అన్నారు. ఈ సలహాను తాను 2013లోనే ఇచ్చానని, అయినా తనను ఎవరూ లెక్కచేయలేదని అన్నారు. ఈ మేరకు పార్లమెంటులో 2013లో తాను మాట్లాడిన క్లిప్‌‌ను జత చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఆనాడు ముందస్తు విజన్‌తో చెప్పినట్లుగానే ఈరోజు తాలిబన్లు అఫ్గాన్‌‌ను స్వాధీనం చేసుకున్నారని ఏఐఎంఐఎం పార్టీ ట్వీట్ చేసింది.