Hyderabad Theft Case: హైదరాబాద్ (Hyderabad) నగరంలో రెచ్చిపోయిన దొంగలను పోలీసులు తేలిగ్గా పట్టుకున్నారు. వారు ఇద్దరూ ఒకేరోజులో ఏకంగా 20 ఇళ్లల్లో దొంగతనాలు (Hyderabad Theft Cases) చేయడం విస్మయం కలిగిస్తోంది. కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌ పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లలో వరుస చోరీలకు వీరు పాల్పడ్డారని హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు (Hyderabad Police) తెలిపారు. వారిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 


బషీర్‌బాగ్ లోని సీసీఎస్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహమయ్య అలియాస్‌ మెహమయ్య అలియాస్‌ బ్రూస్‌లీ, అదే రాష్ట్రం సేడం అనే ప్రాంతానికి చెందిన మందుల శంకర్‌ ఇద్దరూ స్నేహితులు. కూలీ పనులు చేసుకొని బతికేవారు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారు. వీరు పనుల కోసం వివిధ నగరాలు తిరుగుతూ ఉంటారు. మొదట మురికి వాడలు ఉన్న ప్రాంతాల ఆచూకీ తెలుసుకుని, అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుంటారు.


నెల రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో రెక్కీ చేసి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. మద్యం తాగి లేదా గంజాయి పీల్చి ఇక తాము ఎంచుకున్న ప్రదేశాలకు దొంగతనాలకు బయలుదేరతారు. స్ర్కూ డైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌లు వీరి ఆయుధాలు. తాళాలు తెరిచి ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి లాంటి ఖరీదైన వస్తువులు తీసుకొని ఉడాయిస్తారు.


ఇలా వీరు కొంతకాలంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో 53 దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఒకే రోజులో హైదరాబాద్ లో కూకట్‌పల్లిలో 9, ఎల్‌బీ నగర్‌లో 7 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మరికొన్ని నేరాలు కూడా చేశారు. వీటిపై బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేకంగా దృష్టి సారించిన సీపీ సీవీ ఆనంద్‌ (Hyderabad CP CV Anand) సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. డీసీపీ రాధాకిషన్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌, ఘరానా దొంగలు సనత్‌ నగర్‌ పరిధిలోని ఫతేనగర్‌ ప్రాంతం మురికివాడలో ఉంటున్నట్లుగా గుర్తించారు. 


నిందితులు నెహమయ్య, శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా హైదరాబాద్‌లో స్వీట్‌ తయారీ మాస్టర్‌గా పనిచేస్తున్న ఒడిషాకు చెందిన మనోజ్‌ కుమార్‌, బోయిన్‌ పల్లికి చెందిన నామాలా శ్రీధర్‌ అనే వ్యక్తి ద్వారా దోచేసిన బంగారం, వెండిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిపారు. దాంతో మనోజ్‌ కుమార్‌ మాలిక్‌, శ్రీధర్‌ను కూడా అరెస్ట్‌ చేసి మొత్తం నలుగురిని జైలులో వేశారు. ఘరానా దొంగలను పట్టుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను సీపీ సీవీ ఆనంద్ అభినందించినట్లుగా అడిషనల్‌ సీపీ వెల్లడించారు.


మొత్తానికి నిందితుల వద్ద నుంచి 210.48 గ్రాముల బంగారం, 2.792 కిలోల వెండి, 6 ల్యాప్‌ ట్యాప్ లు, 4 వాచ్ లు, ఒక కెమెరా, 2 సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.