Zoom Car Ganja : జూమ్ కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయాలను బాలానగర్ డీసీపీ సందీప్ వెల్లడించారు. జగద్గిరిగుట్ట పరిధి మహదేవపురంలో హ్యూందాయ్ వెన్యూ కారులో గంజాయి తరలిస్తునారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు కారును తనిఖీలు చేస్తే 104 కేజీల గంజాయి పట్టుబడింది. నలుగురు నిందితులు ఆశిష్ కుమార్(35), కొర్ర రవి(25), కొర్ర శ్రీను(20), నాగేశ్వరరావు(52) లను అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర యావత్ మాల్ ప్రాంతానికి గంజాయి తరలిస్తుంటారని డీసీపీ తెలిపారు. నిందితులు జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని గంజాయి సరఫరా చేస్తుంటారని తెలిపారు. 15 లక్షల విలువైన గంజాయి, కారు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు సరికొత్త వ్యుహంతో జూమ్ యాప్ ద్వారా కార్లను, బైక్ లను బుక్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని తెలిపారు.
గంజాయి రవాణాను పట్టించిన రోడ్డు ప్రమాదం
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం స్మగ్లింగ్ ను బయటపెట్టింది. గంజాయి రవాణా చేస్తున్న యువకుడు ఈ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్, వినయ్, జాన్, మహేశ్ లు విశాఖ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. విశాఖ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి సంచితో హైదరాబాద్ వస్తున్నారు. నెల్లుట్ల వంతెన వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తోన్న కారును బైక్ ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు అతన్ని లేపి కొన్ని మంచినీళ్లు తాగించారు. అనంతరం అతన్ని పరిశీలిస్తే సంచిలోని గంజాయి ఉందని గుర్తించారు.
మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై రఘుపతి వెల్లడించారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇతర విషయాలపై విచారణ జరుపుతున్నట్టు ఎస్సై వివరించారు. తనతోపాటు ఉన్న మరో ముగ్గురు ద్విచక్ర వాహనంపై పారిపోయారని పోలీసులు తెలిపారు. తన బైక్ స్టార్ట్ కాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయానని నిందితుడు మహేశ్ అంగీకరించినట్టు ఎస్సై తెలిపారు.