ఓవైపు ల్యాప్ టాప్‌లో వర్క్ చేసుకుంటూ, మరోవైపు పొలం పనులు చేస్తున్న హీరోని మనం మహర్షి సినిమాలో చూశాం. ఇటీవల కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రావడంతో పల్లెటూళ్లకు వచ్చిన రైతు బిడ్డలు కూడా ఇలా పొలంబాట పట్టారు. ఓవైపు ఆఫీస్ పని చేసుకుంటూనే, మరోవైపు పొలం పని చేస్తున్నారు. అయితే వీరంతా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవపోసన పట్టారు. పొగాకు పండే ఆ చేలలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ముస్తాపురంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నరసింహ. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న నరసింహ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చేశారు. ఇక్కడినుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో జాబ్ చేస్తున్నారు. అయితే ఇంటికొచ్చిన తర్వాత తండ్రి చేస్తున్న వ్యవసాయాన్ని తాను కొనసాగించాలనుకున్నారు. కౌలుకి ఇచ్చిన పొలాన్ని తిరిగి తామే తీసుకుని డ్రాగన్ ఫ్రూట్ వేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ఇంటర్నెట్ లో శోధించి వివరాలు సేకరించి డ్రాగన్ ఫ్రూట్ తోటని వేశారు.
అంతర పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు నరసింహ. తండ్రి, తమ్ముడి సాయంతో తాను ఇలా పొలంబాట పట్టానని, రైతు బిడ్డగా ఆ రక్తం తనలో ఉండటం వల్లే తనను మట్టివాసన రారమ్మని పిలిచిందని అంటున్నారాయన. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేస్తే కచ్చితంగా లాభాలబాట పట్టొచ్చని, అయితే మెళకువులు తెలుసుకోవాలని, సాంకేతికత వంటబట్టించుకోవాలని చెబుతున్నారు.
ఉదయం ముస్తాపురంలోని తన ఇంటిలో ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఉద్యోగ విధుల్లో నిమగ్నమవుతారు నరసింహ. ఆ తర్వాత కారులో పొలానికి వస్తారు. డ్రాగన్ ఫ్రూట్ పంటను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెబుతారాయన. తిరిగి కారులో ఇంటికి వెళ్లి.. మళ్లీ విధుల్లో నిమగ్నమవుతారు. ఇలా తన వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు నరసింహ.
ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి తామెలాంటి సాయం ఆశించలేదని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీరు పెడుతున్నామని చెప్పారు. అంతరపంటగా బొప్పాయి సాగు చేస్తున్నామని, డ్రాగన్ ఫ్రూట్ సాగుపై పై ఇప్పుడిప్పుడే ఇక్కడ అవగాహన పెరుగుతోందని, మార్కెటింగ్ పద్ధతులు కూడా తెలుసుకున్నామని అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితం అంటే.. పట్టణాల్లో ఉంటే పని, నిద్ర, షాపింగ్.. ఇలా జరిగిపోతుంటుందని.. పల్లెటూళ్లకు వచ్చిన తర్వాత తమకు ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకునే అవకాశం లభించిందని చెబుతున్నారు నరసింహ. ఆఫీస్ లకు వెళ్లే అవకాశం వచ్చినా.. వారానికోసారి తాము సొంత ఊరుకి వచ్చి వెళ్తుంటామని.. వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తామని చెబుతున్నారు.