Hyderabad Crime : జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిత అత్యాచారం ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితులు దారుణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఘటన సంచలనం అవ్వడంతో ఈ కేసు వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారని సమాచారం. మరో మైనర్‌ బాలిక(13)ను క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి, ఓ రాత్రంతా వేరే చోట ఉంచి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి ఎక్కడ నుంచి తీసుకెళ్లాడో అక్కడే విడిచిపెట్టిన ఘటన ఓల్డ్ సిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సదరు క్యాబ్‌ డ్రైవర్‌ సహా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


అసలేం జరిగింది? 


తన సోదరి కుమార్తె మే 31 సాయంత్రం 6 గంటల నుంచి కనిపించడంలేదని జూన్ 1వ తేదీ రాత్రి బాలిక బంధువుల మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ కేసు వివరాలు పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓల్డ్ సిటీలోని మొఘల్‌పురా పీఎస్‌ పరిధికి చెందిన ఓ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. బాలిక కోసం చుట్టుపక్కల గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొఘల్‌పురా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలిక మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటి రోజు బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆ బాలికను భరోసా కేంద్రానికి పంపించి విచారించగా షేక్ ఖలీమ్ అలీ అనే క్యాబ్‌ డ్రైవర్‌ తనను రంగారెడ్డి జిల్లాలోని ఓ ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. అక్కడ ఓ గదిలో బంధించి మొహమద్ లుక్మాన్ అనే వ్యక్తితో కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. బాలిక స్టేట్ మెంట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇద్దరి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసిన గాలింపు చేపట్టారు. 


పోక్సో కేసు నమోదు 


ఆ బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ గ్రామానికి తీసుకెళ్లానని, అక్కడ క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ షేక్ ఖలీమ్ అలీ,  లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటికి వెళ్తున్న బాలికను కిడ్నాపు చేసి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. భరోసా కేంద్రంలో బాలిక స్టేట్ మెంట్ ప్రకారం ఐపీసీ 363 నుంచి 366 (A), 376 (2) (n), 376 DB, 376 AB r/w 34 సెక్షన్ల కింద మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.