Shadnagar Crime News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. 20 రూపాయల కోసం తల్లి,కొడుకుల మధ్య జరిగిన గొడవ... తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది. మద్యానికి అలవాటు పడ్డ తల్లి.. డబ్బుల కోసం తరచూ తనయుడిని వేధిస్తోందని సమాచారం. ఈ క్రమంలో 20రూపాయలు ఇవ్వమని అడిగిన తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు తనయుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె... ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.
సుగుణమ్మ.. ఈమె వయస్సు 40ఏళ్లు. ఆమెకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయింది. భర్త లేకపోవడంతో కుమారుడు శివతో కలిసి షాద్‌నగర్‌లోని కేశంపేటరోడ్డులో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది సుగుణమ్మ. ఆమె కూతురు నందిని కూడా షాద్‌నగర్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది. సుగుణమ్మ మద్యానికి అలవాటు పడింది. మందు తాగేందుకు డబ్బుల కోసం తరచూ కుమారుడిని వేధిస్తోందని సమచారం. ఈ క్రమంలో ఆదివారం (జనవరి 7న) ఉదయం తల్లి సుగుణమ్మ మందు తాగేందుకు 20రూపాయలు ఇవ్వాలని కొడుకు శివను అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు తనయుడు శివ. పక్కింటి వాళ్లు వచ్చి... శివకు నచ్చజెప్పారు. ఆ తర్వాత శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తల్లి సుగుణమ్మ కూడా బయటకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది.
ఆదివారం (జనవరి 7వ తేదీ) మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన సుగుణమ్మ... షాద్‌నగర్‌లోనే ఉంటున్న కూతురు నందిని ఇంటికి వెళ్లింది. కొడుకు కొట్టిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో నందిని వారి ఇంటికి వచ్చి... తల్లి, తమ్ముడితో మాట్లాడింది. అమ్మను ఎందుకు కొట్టావని తమ్ముడిని నిలదీసింది. డబ్బుల కోసం బాగా సతాయిస్తోందని, ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ మద్యం తాగుతోందని.. దీంతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు. తర్వాత తల్లికి, తమ్ముడికి నచ్చజెప్పింది నందిని. ఆదివారం (జనవరి 7న) మధ్యాహ్నం 3గంటల సమయంలో అక్కాతమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తల్లి సుగుణమ్మ కూడా బయటికి వెళ్లి మళ్లీ మద్యం తాగింది. ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి... ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు.
అదే రోజు.. ఆదివారం (జనవరి 7వ తేదీ) అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ కూతురు నందినికి ఫోన్ చేసింది సుగుణమ్మ. కొడుకు డబ్బులివ్వడం లేదని, తనకు డబ్బులు ఇప్పించాలని చెప్పింది. ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పింది కూతురు నందింది. సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం 9గంటలకు కొడుకు తల్లి సుగుణమ్మను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా... ఆమె లేవలేదు.. సరికదా ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే పక్కింటి వాళ్లను, వైద్యుడిని పిలిపించి చూపించాడు. అప్పటికే సుగుణమ్మ చనిపోయిందని చెప్పారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు సుగుణమ్మ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు కొట్టిందువల్లే తల్లి చనిపోయిందా...? లేక.. ఇంకేమైనా కారణం ఉందా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందన్నారు పోలీసులు.