Miyapur Girl Missing Case: మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ చేసుకుంది. ఆ బాలిక వసంతను కన్న తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా అసలు విషయాన్ని పోలీసులు గుర్తించారు. బాలిక వసంత ఒకరోజు అనుకోకుండా మిస్ కాగా.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదని, ఎక్కడో తప్పిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికను వెతికి పెట్టాలని వేడుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక కోసం గాలించడం మొదలు పెట్టారు.


ఈ కేసులో తాము కనుగొన్న వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవీ.. ‘‘ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని తండ్రి బలవంత పెట్టాడు. తండ్రి కోరిక విని బాలిక గట్టిగా అరిచింది. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక బెదిరించింది. అయితే, తండ్రి బానోతు నరేష్ మాత్రం తరచూ పోర్న్ వీడియోలు చూస్తూ తప్పుడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి నరేష్ ఒత్తిడి తెచ్చారు.


ఆ పాప అమ్మకు చెప్తానని గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని తండ్రి నరేష్ హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని బాలికను నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను చంపేసి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చాడు. ఇంటికి సమీపంలోనే బాలిక మృతదేహం కనిపించింది. మొత్తానికి వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది’’ అని మియాపూర్ పోలీసులు వెల్లడించారు. 


‘‘11 నిమిషాల వ్యవధిలోనే బాలికను తండ్రి నరేష్ హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిందితుడు పరిశీలించాడు. అలా వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ కన్న తండ్రి చూసి వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు నరేష్ దంపతులు ఫిర్యాదు చేశారు.


వారం రోజుల పాటు అస్సలు విషయం దాచాడు. విచారణ అనంతరం బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారించారు. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు చేశారు. వీరి స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మణ్ తండా. బతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు నరేష్ దంపతులు వలస వచ్చారు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును తండ్రి నరేష్ హత్య చేశాడు. నాలుగు బృందాలతో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి మియాపూర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.