Hyderabad News: వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారిని చదివించుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ నెలక్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా అది తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి, తండ్రి మరణంతో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ రహ్మత్ నగర్ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ లో నివసించే 34 ఏళ్ల సింప భరత్ కుమార్ బీహెచ్ఈఎల్ ఆర్టీసీ డిపోలో మెకానిక్ గా పని చేస్తున్నారు. ఏడేళ్ల కిందట మమతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఆరేళ్ల విశాల్, రెండేళ్ల సంయుక్తనిధి ఉన్నారు. భరత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల రోజులు సెలవు కావాలని దరఖాస్తు ఇచ్చేందుకు జనవరి 31వ తేదీన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై డిపో వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎర్రగడ్డ ఫ్లైఓవర్ మీదుగా వస్తుండగా... వెనక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. భార్య తలకు తీవ్ర గాయమై మృతి చెందగా.. భరత్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. చిన్నారి క్షేమంగా బయట పడింది. భార్య చనిపోయిన తర్వాత భరత్.. తండ్రి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. మంగళవారం ఉదయం 9.45 గంటలు అయినా తాను నిద్రించిన గది తలుపు తీయలేదు. తండ్రి తలుపు తట్టినా తీయకపోవడంతో రమేష్ కు విషయాన్ని తెలిపాడు. 


రమేష్ కిటికీలో నుంచి చూడగా.. ఫ్యానుకు చీర కనిపించింది. తలుపు గట్టిగా నెట్టడంతో బోల్టు ఊడి తలుపు తెరుచుకుంది. అప్పటికే ఫ్యానుకు వేలాడుతూ.. అచేతనంగా కనిపించడంతో 108 అంబులెన్స్, జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు ధ్రవీకరించారు.  


శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి ఆత్మహత్య


హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్‌ అనే విద్యార్థి తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని.. వివరించారు. పోలీసులు, సాత్విక్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలని టార్చర్


"సాత్విక్ మా ఫ్రెండ్. మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ వాళ్లు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. అది తట్టుకోలేక వాడు అలా చేస్కున్నడు. ఒత్తిడి భరించలేక వాడు మాతో కూడా మాట్లాడట్లేదు. దీంతోనే నిన్న రాత్రి పదిన్నరకు సూసైడ్ చేస్కున్నడు." - షణ్ముఖ్, విద్యార్థి