Hyderabad Woman Suicide: రెండు నెలల క్రితమే పెళ్లైంది. భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన ఆమె సెల్ ఫోన్ లో ఎక్కువగా వీడియోలు చూసేది. ఏ పనీ చేయకుండా ఎప్పుడూ ఫోన్ పట్టుకొని ఉండడంతో భర్త మందలించేవాడు. తరచూ ఇలాగే జరుగుతుండడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. భయపడ్డ అతడు యువతి తల్లికి ఫోన్ చేసి తాముండే చోటుకు రమ్మన్నాడు. ఆమె అక్కడికి చేరుకునేలోపే యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అక్టోబర్ 13వ తేదీనే అంగరంగ వైభవంగా పెళ్లి..


విజయవాడకు చెందిన కమల జనార్ధన్ రెడ్డి కుమార్తె శైలజ(20)ను కడప జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్ రెడ్డి కుమారుడు గంగా ప్రసాద్ రెడ్డికి ఇచ్చి ఇదే ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఘనంగా పెళ్లి చేశారు. ఉద్యోగ రిత్యా గంగా ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ చింతల్ లోని శ్రీసాయి కాలనీలో అద్దెకు ఉంటున్నారు. శైలజకు పెళ్లికి ముందు నుంచే సెల్ ఫోన్ లో షార్ట్ వీడియోలు చూడడం అలవాటు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె భర్తతో కంటే ఎక్కువగా సెల్ ఫోన్ తోనే గడుపుతోంది. దీంతో భర్త గంగా ప్రసాద్ రెడ్డి ఎక్కువగా వీడియోలు చూడొద్దని భార్యకు చెప్పాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ముందు ప్రేమగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం కాస్త గట్టిగా చెప్పడం ప్రారంభించాడు. ఆమె అతడు చెప్పింది వినకపోగా గొడవ పడేది. 


భర్తకు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్న శైలజ..


బుధవారం రోజు కూడా వీరిద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో శైలజ బుధవారం రాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్తతో చెప్పింది. భయపడ్డ గంగా ప్రసాద్ రెడ్డి.. శైలజ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆమె తల్లి కమలను హైదరాబాద్ కు రమ్మని టికెట్ కూడా బుక్ చేశాడు. ఆమె విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భర్త పడుకున్న విషయం గుర్తించిన శైలజ... చడీ చప్పుడు కాకుండా బయటకు వచ్చింది. వాళ్లుంటున్న భవనం రెండో అంతస్తు పైనుంచి దూకింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో మెలుకువ వచ్చిన గంగా ప్రసాద్ రెడ్డి బయటకు వచ్చి చూశాడు. అయితే అప్పటికే భార్య శైలజ చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతడు భయపడిపోయి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. 


తల్లి ఇంటికి వచ్చేలోపే భవనం పైనుంచి దూకిన కూతురు..


హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. శైలు తల్లి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శైలజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నూరేళ్లు చల్లగా ఉండాలని ఎన్నో ఆశలతో కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన రెండు నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించలేకపోతున్నారు. కనీసం కూతురుకు పెళ్లి చేయకపోయినా తమకు కడుపుకోత ఉండకపోయేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.