DAV School Incident : ఎల్.కె.జి స్టూడెంట్ పై లైంగిక దాడి ఘటనలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈవోకు  ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సూచించారు. తాజా నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని డీఈవోను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సందేహాల నివృతి చేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా పరమైన చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ నివేదిక రాగానే విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.   


పోక్సో కేసు 


బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో ప్రిన్సిపల్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రినిపల్ ను అరెస్టు చేశారు. డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్లి చిన్నారిపై ప్రిన్సిపల్‌ వాహన డ్రైవర్‌ రజనీ కుమార్‌(34) లైంగిక దాడికి పాల్పడ్డాడు.  నిందితుడిని మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలలో ప్రిన్సిపల్‌ రూమ్ సమీపంలోని డిజిటల్‌ తరగతి గదిలోనే డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్‌ మాధవి(56) నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


డీఏవీ స్కూల్ యాజమాన్యం విచారణ 


డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పర్తిపన్ ను స్కూల్ యాజమన్యం విధుల నుంచి బహిష్కరించింది.  ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఉన్న మాధవిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సఫిల్ గుడా డీఏవీ స్కూల్ బ్రాంచ్ కు ఫీడర్ బ్రాంచ్ గా ఉన్న బంజారాహిల్స్ బ్రాంచ్ నడుస్తోంది. ఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ ఇంటర్నల్ కమిటీ హైదరాబాద్ ఘటనపై విచారణ చేస్తుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న BSD DAV పబ్లిక్ స్కూల్ లో LKG బాలికపై కార్ డ్రైవర్ రజినీకుమార్ గత రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడడం సంచలం అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్ , ఆమె డ్రైవర్ పై పోక్సో కేసు పెట్టారు.