ITC Shares: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి (Q2FY23) ఘనమైన ఆదాయాలను ITC ప్రకటించడంతో, ఇవాళ్టి (శుక్రవారం) స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ అవర్‌లో ఈ స్క్రిప్‌లో ఉత్సాహం కనిపించింది. ఇంట్రా డే ట్రేడ్‌లో, BSEలో 1 శాతం పెరిగిన ITC షేర్లు రూ.354 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. 2017 జులై 3న తాకిన దాని మునుపటి గరిష్ట స్థాయి రూ.353ని షేర్లు ఇవాళ అధిగమించాయి.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు (YTD) చూస్తే, ITC ఔట్ పెర్ఫార్మ్ చేసింది. CY22లో S&P BSE సెన్సెక్స్ నామమాత్రంగా 0.53 పెరిగితే, ఈ కౌంటర్ 62 శాతం లాభాలను ఆర్జించింది. గత నెల రోజుల్లో దాదాపు 2 శాతం వృద్ధితో ఫ్లాట్‌గా ఉన్నా, గత ఆరు నెలల కాలంలో 35 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
Q2 ఫలితాలు
2022 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో ITC ఏకీకృత నికర లాభం రూ. 4619.77 కోట్లకు చేరింది. కంపెనీ సిగరెట్‌లు, స్నాక్స్‌కు డిమాండ్ పెరగడంతో, లాభంలో గత ఏడాది కంటే 24% వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 3,713.76 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో (Q1FY23) ఈ FMCG మేజర్ ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 4389.76 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్ (QoQ) ప్రాతిపదికన చూసినా లాభం 5% పెరిగింది.
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్ రెవెన్యూ) గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలోని రూ. 14,844 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 25% పెరిగి రూ. 18,608 కోట్లకు చేరుకుంది. 2022-23 సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు రూ. 12,824 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 10,258 కోట్లతో ఇవి కూడా 25% పెరిగాయి.
సిగరెట్ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం గత సంవత్సరం కంటే 23.3% పెరిగింది. గోధుమ, బియ్యం, ఆకు పొగాకు ఎగుమతుల ద్వారా వ్యవసాయ వ్యాపార విదేశీ ఆదాయంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. హోటల్స్ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం గత ఏడాది సప్టెంబర్ త్రైమాసికం కంటే ఈసారి బలంగా 81.9% పెరిగింది.
'బయ్' కాల్
ITC భవిష్యత్ వృద్ధి మీద ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పూర్తి నమ్మకంతో ఉంది. సిగరెట్ల మీద పన్నులు పెరక్కపోవడం, ముడి సరుకు ధరలు తగ్గడం వల్ల FMCG సెగ్మెంట్‌లో లాభాలను కొనసాగిస్తుందని చెబుతోంది. ITC స్టాక్ మీద BUY సిఫార్సును కొనసాగిస్తూ, టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.360 నుంచి రూ.405కి పెంచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.