మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12.4 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు ఆ నగదును ముగ్గురి ఖాతాల్లోకి జమచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన ముగ్గురి ఖాతాలను గుర్తించిన పోలీసులు... వారిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించారు. వారిద్దరికీ ఈ హ్యాకింగ్ తో సంబంధంలేదని తేల్చారు. సైబర్ నేరగాళ్లు వినోద్‌, నవీన్‌ అనే ఇద్దరి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా నగదు డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. అయితే ఆ ఇద్దరి ఖాతాల నుంచి నగదును సైబర్‌ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి డిపాజిట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


మూడు ఖాతాల నుంచి 128 ఖాతాల్లోకి మనీ ట్రాన్స్ ఫర్


ఈ ఖాతాల్లో మూడో వ్యక్తి షానవాజ్‌ ఖాతాలో రూ.6.9 కోట్లు జమ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి ఇతర ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అయితే షానవాజ్ ఫోన్‌ స్విచ్ఛాఫ్ కావడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. షానవాజ్‌ కొన్ని నెలల కిందట ముంబయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్‌ నేరగాళ్లకు షానవాజ్ సహకరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురి ఖాతాల నుంచి రూ.12.4 కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు ఇప్పటికే 128 ఖాతాలకు బదిలీ చేశారు. ఆ ఖాతాల నుంచి మరో 200 ఖాతాలకు నగదు బదిలీ అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలన కోసం తెలంగాణ పోలీసులు కోల్‌కతా వెళ్లనున్నారు. 


కరెంట్ ఖాతాలతో


హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ సైబర్ మోసం జరిగింది. మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసిన నిందితులు 12.4 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండానే ఇటీవల తెరిచిన మూడు కరెంట్ ఖాతాల్లోకి చెస్ట్ ఖాతా నుంచి హ్యాకర్లు రూ.12 కోట్ల నగదు బదిలీ చేసుకున్నారని గుర్తించారు. దీనిపై మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ (CCS Police) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుకు రాష్ట్రంలో పలు శాఖలు ఉన్నాయి. వీటి ప్రధాన సర్వర్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ కార్యాలయం కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు జరుగుతుంటాయి. అయితే బ్యాంకుకు కన్నం వేసేందుకు కొన్ని రోజుల కిందటే భారీ ఎత్తున హ్యాకర్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Also Read: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...