Madhapur Accident : హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అనంతరం రోడ్డు పక్కన గల సెల్లార్ లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైకు ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైన ముగ్గురిని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు ఫ్రాక్చర్ కాగా మరో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సాయి కృష్ణపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



మద్యం మత్తులో ప్రమాదాలు 


హైదరాబాద్ రోడ్లపై తాగుబోతు యమకింకరులు కార్లతో తిరుగుతున్నాయి. కిక్కెచ్చే వరకు ఫుల్ గా మందు కొట్టి రోడ్లపైకి వాహనాలతో దూసుకొస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై ఇతర వాహనాలను ఢీకొట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను తీసుకుంటున్నారు. నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నా ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు. నగరంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడుతున్నా ఎదుటి వారిని ఆసుపత్రి పాల్జేస్తున్నారు. 


పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం 


పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్  ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, బస్సులోని 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి పట్టణం అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై శనివారం రాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. 


డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ?

జగన్ ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో నిద్రమత్తులో ఉన్న  డ్రైవర్ ట్రావెల్స్ బస్సును దామరచర్ల సమీపంలో హై స్పీడ్ లో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌టెక్ చేయబోయాడు. పరిస్థితి గమనించిన ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ ను వారించారు. ప్రయాణికులు పదే పదే చెప్పడంతో కొంతదూరం డ్రైవర్ జాగ్రత్తగానే నడిపినట్లు కనిపించాడు. కానీ నిద్రమత్తులో డ్రైవర్ ట్రావెల్స్ నడుపుతుండటంతో ప్రయాణికులు వారించిన తరువాత కేవలం 25 కిలోమీటర్లు వెళ్లిన తరువాత దాచేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు జగన్ ట్రావెల్స్ డ్రైవర్. ఈ ఘటనలో ట్రావెల్స్‌ క్లీనర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు. 20 మంది ప్రయాణికులు గాయపడగా, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ అతివేగంగా డ్రైవ్ చేయడం, నిద్ర మత్తు కూడా కారణమని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే లారీని ఢీకొట్టిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. ప్రమాదంలో గాయపడిన  వారిని చికిత్స నిమిత్తం గురజాల‌ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారైన డ్రైవర్ వివరాలు సేకరించే పనిలో పడ్డారు.