నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. న్యూ ఇయర్ 2023 వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి యువత సిద్ధమవుతున్నారు. వేడుకలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో పబ్లు, క్లబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, శివారు ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లు, త్రి స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యూఇయర్ ఈవెంట్స్ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మొత్తంలోనే ఈవెంట్స్‌కు ఏర్పాట్లు జరుగుతుండటంతో ఆ స్థాయిలొనే అధికారులు మాదకద్రవ్యాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా గోప్యంగా సరఫరా అవుతున్న డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నా, రేవ్ పార్టీలు జరుగుతున్నట్లు తెలిస్తే 9490617111 నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని రాచకొండ పోలీసులు సూచించారు.
రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా యువత పబ్లు, క్లబ్లు, రిసార్టుల్లో యువత ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో సాధారణంగానే మత్తుపదార్థాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించే చోట రేవ్ పార్టీలుగానీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని.. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, రేవ్ పార్టీల కేసుల్లో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. దేశ విదేశాల్లోని నగరాల నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్, ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదకద్రవ్యాలు సరఫరా అవుతుంటాయి. వీటితో పాటు విశాఖ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల నుంచి క్వింటాళ్లకొద్ది గంజాయి నగరానికి చేరుతుంటుంది. ఇప్పటికే నగరంలో మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో నిర్వాహకులు చాలా జాగ్రత్తగా పోలీసుల కంటపడకుండా మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.






గత కొన్నిరోజులనుంచి ట్రై కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపి డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల నగరంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతుండటంతో న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా పోలీసులు పబ్లు, క్లబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, రేప్పార్టీలు, న్యూ ఇయర్ ఈవెంట్లపై పోలీసులు ప్రత్యేక నజర్ పెంచారు. కొన్ని డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుంచి, దేశాలనుంచి సరఫరా అయితే మరికొన్ని శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల నుండి తయారవుతునట్టు పోలీసులు గుర్తించారు.


NDPS స్పెషల్ టీమ్ పోలీసులు శివారు ప్రాంతాల్లోని మూతపడ్డ పరిశ్రమలు, గోదాములు, అనుమానాస్పద కంపెనీలపై ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక నజర్ పెంచినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీసులు. పదుల సంఖ్యలో గంజాయి, డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. వందలాది మంది స్మగ్లర్లను పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం జైళ్లలో ఎన్డీపీఎస్ యాక్టుపైన అరెస్టయిన స్మగ్లర్స్ వందల సంఖ్యలో ఉన్నారు. 
డ్రగ్స్ కేసులు, నలుగురు కింగ్ పిన్‌లు అరెస్ట్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1082 మందిని నిందితులుగా చేర్చారు. అందులో ప్రధాన కింగ్ పిన్ నలుగురు నిందితుల సైతం జైల్ కి తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 185 డ్రగ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సైబరాబాద్ లో ప్రత్యేక ఎన్డీపీఎస్ టీమ్స్ సైతం రంగంలోకి దిగి మాదక ద్రవ్యాల సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది 6475 కేజీల గంజాయి, 37.43 గంజాయి మొక్కలు, 141 కేజీల alprazolam, 402.3 గ్రాముల MDMA, 225 గ్రాముల కొకెయిన్, 12.225 లీటర్ల హాష్ ఆయిల్, 421గ్రాముల ఓపియంని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో ఎక్కువ పబ్స్, బార్స్, రేవ్ పార్టీలు జరిగే అవకాశం ఎక్కువని ఆ ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ విభాగం ఇస్తున్న విశ్వసనీయ సమాచారంతో సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
ఇక రాచకొండ పరిధిలో ఈ ఏడాది సుమారు రూ.10 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డిపిఎస్ యాక్ట్ కింద 223 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 635 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 94 మందిపై పిడి యాక్ట్ లు పెట్టీ కటకటాల్లోకి నెట్టారు. 7502.8 కేజీల గంజాయి, 1.5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 83.89 లీటర్ల హాష్ ఆయిల్, 8.5కేజీల pseudoephedrine, 6.3 లీటర్ల methamphetamine, 500 గ్రాముల పాపి స్ట్రా, 12లీటర్ల ఓపియం ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.