Honour Killing In Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న నాగరాజు పరువు హత్య మరవకముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ లోని మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడి వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. బైక్ ఆపిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
మచ్చి మార్కెట్‌లో దారుణం..
నగరంలో ఇటీవల జరిగిన నాగరాజు పరువు హత్యను హైదరాబాద్ వాసులు మరిచిపోకముందే నడిబొడ్డున మరో వ్యక్తిని హతమార్చారు. గత ఏడాది నీరజ్ పన్వార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి అమ్మాయి కుటుంబసభ్యులు అతడిపై కక్షకట్టారు. ఈ క్రమంలో నలుగురు గుర్తుతెలియని దుండగులు బేగం బజార్ మచ్చి మార్కెట్‌లో వెళ్తున్న నీరజ్ పన్వార్ బైక్ అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారు. వెంటనే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై 10 నుంచి 20 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. పరువు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.