AP MLA Adinarayana Reddy Son Arrest in a drug case: హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు చేసింది. ఆ పార్టీలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిగా గుర్తించారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికడంతో వెంటనే టెస్టు నిర్వహించారు. టెస్టులో పాజిటివ్ గా తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ రెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం సుధీర్ రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి, నిబంధనల ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
సుధీర్ రెడ్డి ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం ఇదే మొదటిసారి కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా రెండుసార్లు ఇదే తరహా మాదకద్రవ్యాల కేసుల్లో ఆయన పోలీసులకు దొరికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వరుసగా మూడోసారి డ్రగ్స్ కేసులో చిక్కడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇంకా స్పందించలేదు.
ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆయన తండ్రి కోసం ప్రచారం చేసేవారు. నేరుగా ఎప్పుడూ రాజకీయాల్లో పాల్గొనలేదు. ఆదినారాయణరెడ్డి కూడా తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గం అయిన జమ్మలమడుగులో గట్టి పట్టు ఉన్న ఆదినారాయణ రెడ్డి ఎక్కువ సార్లు విజయం సాధించారు. ఒక్క సారే ఓడిపోయారు.