Devi Sri Prasad : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయింది. 'ఓ పారి' అనే ఆల్బమ్ లో హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించారని దేవిశ్రీ ప్రసాద్ పై నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయసలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  


నటి కరాటే కల్యాణి ఫిర్యాదుతో 


ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై నటి కరాటే కల్యాణి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటి కరాటే కల్యాణితోపాటు పలు హిందు సంఘాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన "హరే రామ హరే కృష" మంత్రం పై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని అన్నారు. లేని పక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నటి కరాటే కల్యాణి  హెచ్చరించారు. 






బీజేపీ నేతలు ఆగ్రహం 


స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ నటించిన ఆల్బమ్ ఇది. ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో అక్టోబర్ లో విడుదల అయింది. తెలుగులో "ఓ పిల్లా" పేరుతో వచ్చింది. మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పై భారతీయ జనతా పార్టీ కూడా ఆగ్రహంగా ఉంది. ఆయన రూపొందించిన ఓ పాట కర్ణ కఠోరంగా ఉందని తక్షణం ఆ పాటను అన్ని చోట్లా డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.  అందులో బీజేపీ చాలా పవిత్రంగా భావించే దేవుడి పాటను పేరడిచేసి అసభ్యంగా పెట్టారట. అందుకే ఆ పాటను డిలీట్ చేయాలంటున్నారు. కోట్లాది మంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్థసారధి ఈ డిమాండ్‌ను వినిపించారు.