ఫారెస్ట్ ఆయిల్ పేరుతో మోసపోయింది ఒకరు….లాటరీ వచ్చిందంటే నమ్మి గిఫ్ట్ ట్యాక్స్ కింద డబ్బులు కట్టి మోసపోయింది మరొకరు… కెవైసి అప్‌డేట్ చేయాలని కాల్ వస్తే మోసపోయింది ఇంకొకరు…హైదరాబాద్ లో ఒక్కరోజులో సైబర్ నేరగాళ్లు ఈ రేంజ్ లో రెచ్చిపోయారు.
ఆగ్రోసీడ్ ఆయిల్ పేరుతో మోసం
హైదరాబాద్ కి చెందిన గీతనారాయణ్ పేరుతో డాక్టర్ మురళీమోహన్ రావుకు ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో ఖరీదైన ఆయిల్ వ్యాపారం చేస్తున్నానని డాక్టర్‌ను నమ్మించాడు. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రోసీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని చెప్పాడు. ఈ వ్యాపారం చేస్తే లాభాలు భారీగా వస్తాయనడంతో… దశల వారీగా అమెరికా డాలర్ల రూపంలో 11కోట్ల రూపాయలు పంపించాడు మురళీమోహన్ రావు. డబ్బులు ముట్టేవరకు నిత్యం చాటింగ్ చేసిన నిందితుడు డబ్బులందాక మాత్రం స్పందించడం మానేశాడు. మోసపోయానని గ్రహించిన బాధిత వైద్యుడు సైబ్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లాటరీ వచ్చిందని టోకరా….
షాపింగ్స్ కి వెళ్లేటప్పుడు బయట గిఫ్టు కూపన్లు ఇస్తుంటారు. నింపితే పోయేదేముందిలే అనుకుంటారంతా. అలా గిఫ్టు కూపన్లు ఫిల్ చేసిన ఓ మహిళకు ఈ మధ్య గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఇటీవల మీరు చేసిన షాపింగ్‌లో రిజిస్ట్రర్ అయిన మీ మొబైల్ నంబర్‌కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని చెప్పాడు. ఎక్కడో ఫిల్ చేసిఉంటాను…జాక్ పాట్ తగిలిందని సంబరపడిందామె. గిఫ్ట్ ట్యాక్స్ కింద 30శాతం డబ్బులు ముందుగానే చెల్లించాలని చెప్పడంతో నమ్మింది. సైబర్ కేటుగాళ్లు చెప్పినట్లుగా వారి చెప్పిన బ్యాంక్ ఖాతాకు ఏకంగా రూ.5,25,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత వారికి ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ రావడంతో నిండా మునిగిపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
కెవైసీ అప్‌డేట్ పేరుతో….
కేవైసి అప్‌డేట్ చేయాలని చెప్పి సైబర్ కేటుగాళ్లు బాధితుడిని నమ్మించి రూ.5లక్షలు కొట్టేశారు. నగరంలోని డిడి కాలనీకి చెందిన సత్యనారయణకు రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని మీ సిమ్ కార్డు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుందని చెప్పాడు. తాను మొబైల్‌కు లింక్ పంపిస్తున్నానని దాని ద్వారా కెవైసి అప్‌డేట్ చేయాలని నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థుడు పంపించిన లింక్ ఓపెన్ చేసి డెబిట్ కార్డు నంబర్, తన వివారాలు నమోదు చేశాడు. తర్వాత తన మొబైల్‌కు వచ్చిన ఓటిపి నంబర్ కూడా సైబర్ నేరస్థులకు చెప్పాడు. సులువుగా పని పూర్తవడంతో వెంటనే సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి 5లక్షల 30 వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. డబ్బులు తన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా కాగానే మోసపోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మూడు ఘటనలు వెలుగులోకి వచ్చాయి…కానీ…ఇంకా బయటపడిని మోసాలెన్నో జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు కూడా పట్టించుకోపోవడంతో సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. వరుస ఫిర్యాదులతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.