Hyderabad Crime News: రెండు రోజుల కిందట కూతురు ఇంట్లో శుభకార్యం ఉంటే వెళ్లింది. నిన్న రాత్రే డ్రైవర్ ఆమెను తన ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. అర్థరాత్రి నిద్రపోయిన వృద్ధురాలు ఉదయం ఎంతకూ బయటకు రాకపోవడంతో.. పక్కింట్లో ఉన్న ఓ అమ్మాయి ఆమె వద్దకు వెళ్లింది. లేపే ప్రయత్నం చేయగా ఆమె ఎంతకూ లేవలేదు. దీంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పగా... వెళ్లి చూసిన వాళ్లు వృద్ధురాలు చనిపోయినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కూతురు ఇంటికి రాగా.. తల్లి మెడలో ఉన్న 23 తులాల బంగారం లేదని, ఆమెను ఎవరో కావాలని చంపేసినట్లు అనుమానం కల్గుతోందని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని తొర్రూరులో సంరెడ్డి సత్యమ్మ అనే మహిళ తన కుమారుడితో పాటు ఉంటోంది. అయితే రెండ్రోజులు కిందట వీళ్లు వనస్థలిపురంలోని తన కుమార్తె ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అయితే నిన్న రాత్రే ఆమె ఇంటికి వెళ్తానని చెప్పగా.. డ్రైవర్ ను ఇచ్చి పంపించింది కూతురు. డ్రైవర్ కూడా సత్యమ్మను రాత్రి 8 గంటలకు ఇంటి దగ్గర దిగబెట్టాడు. దీంతో లోపలికి వెళ్లిన సత్యమ్మ పడుకుంది. ఉదయం చాలా సేపు అవుతున్నా ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో.. పక్కింట్లో ఉన్న ఓ బాలిక సత్యమ్మ దగ్గరకు వెళ్లింది. అయితే అప్పటికే ఆమె విగత జీవిగా పడి ఉంది. కానీ అది గుర్తించని బాలిక ఆమె లేపే ప్రయత్నం చేసింది. ఎంతకూ పలక్కపోవడంతో.. వెంటనే వెళ్లి విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. వెంటనే వాళ్ల పోలీసులతో పాటు సత్యమ్మ కూతురు, కొడుక్కు ఫోన్ చేసి విషయం చెప్పారు.
హుటాహుటిన వచ్చిన కూతురు.. సత్యమ్మను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన తల్లి మెడలో ఉన్న 23 తులాల బంగారం లేనట్లు గుర్తించింది. ఎవరో కావాలనే హత్య చేసి బంగారం తీసుకెళ్లి ఉంటారని ఆరోపించింది. అలాగే సత్యమ్మ కొడుకు బాల్ రెడ్డి తమ తల్లి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు వివరించారు. అలగే ఆమె పడుకుని ఉన్న బెడ్ పక్కనే ఓ బీరువా ఉందని.. అందులో ఉన్న బంగారం అంతా అలాగే ఉందని తెలిపారు. కావాలనే తమ అమ్మను ఎవరో చంపి బంగారం దోచుకెళ్లి ఉంటారని చెబుతున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో సత్యమ్మ ఇంటి చుట్టూ తిరిగి ఆధారాలు వెతికారు. తెలిసిన వాళ్లే ఈ దారుణానికి పాల్పడే అవకాశం ఉందని.. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
మరోవైపు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, డీసీపీ సాయి శ్రీ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ వివరించారు. అర్ధరాత్రి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా జరిగిన ఈ ఘటనతో స్థానికులంతా తీవ్రంగా భయపడిపోతున్నారు.