Hyderabad Crime News: హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని దుండగులు అపహరించారు. తల్లి భోజనం చేసేందుకు వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని అపహరించారు. ఆమె తిరిగి వచ్చే సరికి బాబు కనిపించకపోవడంతో.. అక్కడున్న వారందిరినీ అడిగింది. ఆసుపత్రిలో అంతా వెతికారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం అంతా చెప్పి తమ పాపపను తమకు వెంటనే అందించేలా చూడాలని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. ముందుగా ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకున్నామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇస్తున్నారు. 


ఇటీవలే వరంగల్ లో నాలుగో తరగతి విద్యార్థిని కిడ్నాప్


వరంగల్ లో  బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై  బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  


"దుకాణానికి వెళ్లిన చిన్నారిని ముగ్గురు వ్యాన్ లో వచ్చి కిడ్నాప్ చేశారు. ఛాయ్ తాగేందుకు ఆగినప్పుడు బాలికకు మెళకువ వచ్చింది. చిన్నారి వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటబడ్డారు. అయితే అక్కడున్న వాళ్లు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చెప్పడంతో ఆ ముగ్గురు అక్కడ నుంచి పారిపోయారు. ముఖానికి కర్ఛీఫ్ తో ముగ్గురు వచ్చారని అమ్మాయి చెబుతోంది." - చిన్నారి బంధువు


"పాప షాపునకు వెళ్లింది. అమ్మాయి రోడ్డు దాటేవరకూ అక్కడే నిలబడ్డాను.  పది నిమిషాలు అయినా ఇంకా పాప రాలేదు. మా అబ్బాయిని పంపి షాపు వద్ద అడిగితే ఎవరు రాలేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాను. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అక్కడ కూడా చూశాం, కానీ అక్కడికీ వెళ్లలేదు. ఇంతలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పాప వరంగల్ లో ఉందని ఫోన్ వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందని అడిగితే ఎవరో వ్యాన్ లో తీసుకొచ్చారని బాలిక చెప్పింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాం. "- బాలిక తల్లి  


Read Also:Kota Suicides: కోటాలో మరో విద్యార్థి మృతి, గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య