Hyderabad News: ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం వెబ్ సైట్లో పోస్టు పెట్టిన ఓ వృద్ధ తండ్రిని సైబర్ నేరగాళ్లు మోసగించి రూ. 26 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేయాలని ఇటీవల ఆయన వారి సామాజిక వర్గానికి చెందిన ఓ వెబ్ సైట్ లో ఆ ఇద్దరు అమ్మాయిల వివరాలను పోస్టు చేశారు. ఆ వివరాలు చూసిన ఓ వ్యక్తి పెద్ద కుమార్తె నచ్చిందని ఆ వృద్ధునితో మాట కలిపాడు. మరుసటి రోజు అతడే ఫోన్ చేసి మీ చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కొడుక్కి ఇస్తారా ఇద్దరు అమ్మాయిలు ఒకటే చోట కలిసి ఉంటారు అంటూ ఆ వృద్ధుడిని నమ్మించాడు. ఇద్దరు కూతుళ్లకు ఒకటే ఇంటి నుండి పెళ్లి సంబంధం రావడంతో ఆ తండ్రి ఎంతో ఆనందపడ్డాడు. దాదాపు వారం రోజుల పాటు వారి మధ్య ఫోన్ ల ద్వారానే సంభాషణలు జరిగాయి. ముందుగా ఫోన్ చేసిన వ్యక్తి మరోసారి ఫోన్ ద్వారా సంప్రదించి తన కొడుకు అర్జెంటుగా యూఎస్ కు వెళ్లాలని, త్వరగా పెళ్లి చేసేద్దామని నమ్మబలికాడు. ఇద్దరి అమ్మాయిలకు సంబంధించి ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పాడు. అనంతరం డబ్బు కూడా అడిగాడు. 


అతడి మాటలు నమ్మిన ఆ తండ్రి అతడికి పలు దఫాలుగా రూ. 26 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోతే బాధ్యత తీరుతుందన్న భ్రమలోనే ఉన్నాడు ఆ తండ్రి. వాళ్లు ఎంత అడిగితే అంత ఇస్తూ పోయాడు. ఏదో ఓ కారణం చెప్పి తరచూ పెళ్లి చూపులను వాయిదా వేస్తూ వస్తున్నారు. అసహనానికి గురైన ఆ తండ్రి వారి సామాజిక వర్గానికి చెందిన వెబ్ సైట్ లో ఎంక్వైరీ చేశాడు. అడిగిన ఎవరికీ వారి వివరాలు తెలియదనే రిప్లై వచ్చింది. ఆ తండ్రి చెప్పిన వివరాలతో వెబ్ సైట్ లో ఎవరూ లేరని తేలడంతో ఆ వృద్ధ తండ్రి గుండె పగిలినంత పనైంది. ఇంతకాలం రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు అంతా వారు కాజేయడం, కూతుళ్ల పెళ్లి అయిపోతుందన్న ఆశ అన్నీ పటాపంచలు కావడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. ఇద్దరి కుమార్తెల భవిష్యత్తును కాపాడాలని, దోచుకున్న డబ్బులు ఇప్పించాలంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇదే ఏడాది జనవరిలోనూ ఇలాంటి ఘటనే..


చందానగర్ లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి డిసెంబర్ చివరి వారంలో ఆన్ లైన్ లో కాల్ కోసం(ఎస్కార్ట్ సర్వీస్) వెతికాడు. ఓ వైబ్ సైట్ లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే వాట్సాప్ నంబర్ దొరికింది. పటేల్ ఛార్మి వ్యక్తి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు. బుకింగ్ కోసం రూ.510, తర్వాత రూ.5,500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.