Hyderabad Drugs : హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరిలో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 8.5 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ముఠా వెనుక కీలక సూత్రధారులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

  






దేశం దాటి 75 కేజీల డ్రగ్స్ 


 "చెన్నై నుంచి హైదరాబాద్ , పూణే మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కు సూడో ఎఫిడ్రిన్  డ్రగ్ ను పంపిస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 8.5 కిలోల సూడో ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నాం. సీజ్ చేసిన మొత్తం ప్రాపర్టీ విలువ 9 కోట్లు. మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ ను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఫేక్ ఐడీ కార్డులు, ఆధార్లతో పట్టుబడ్డారు. లుంగీలు ఫాన్సీ ఐటమ్స్ బాక్సుల్లో పార్సల్ చేసి కొరియర్లో బస్సుల్లో రోడ్డు మార్గం ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారు. వీటిలో డ్రగ్స్ తయారు చేసే ప్రాంతం డ్రగ్స్ నిల్వ ఉంచే ప్రాంతం తరలించే ప్రాంతం మూడు కీలకం. హైదరాబాద్ కేవలం డ్రగ్స్ ట్రాన్సిట్ ఏరియా మాత్రమే. ఈ డ్రగ్ నుంచి మేటాంఫిటమైన్ తయారు చేస్తారు. రాంరాజ్ ధోతి కోసం వాడే కాటన్ బాక్స్ లో  పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో బాక్స్ లో 80 నుంచి, 90 గ్రాముల ప్యాకెట్ పెడుతున్నారు. ఇలా 7 సార్లు పూణే నుంచి, 8 సార్లు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 75 కిలోల డ్రగ్ ఇప్పటి వరకు దేశం దాటించారు. ఫరీద్ , ఫైసల్ పూణే నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సింథటిక్ డ్రగ్ కేజీకి కోటి ధర ఉండగా, మెటాఫెటమినే కేజీ రూ.5 కోట్లు విలువ ఉంటుంది." - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ