Hyderabad Explosion: హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజూ డంపింగ్ యార్డులో 45 ఏళ్ల చంద్రన్న,  ఆయన కుమారుడు 14 ఏళ్ల సురేష్ చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం కూడా చెత్త ఏరుతుండగా పడేసి ఉన్న పెయింట్ డబ్బాలను కదిలించారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి చంద్రన్నకు తలకు గాయాలు కాగా.. కుమారుడు సురేష్ కు చేయి విరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. 


ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తదితరులు పరిశీలించారు. ఈ మేరకు అన్ స్పెక్టర్ మోహన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


నాలుగు రోజుల కిందట నిజామాబాద్ లో..


నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండో పోలీస్ స్టేషన్ పెద్దబజార్ లో శనివారం రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికంగా పేలుడుతో అక్కడి శివసాయి వైన్య్, ఫ్యాషన్ స్టోర్, లక్ష్మీ నరసింహ స్వామి జనరల్ స్టోర్ లకు సంబంధించిన షెడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. చెత్త ఏరుకునే వ్యక్తి కెమికల్ పదార్థాలను తీసుకురావడం వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. కెమికల్ పదార్థాలు ఉన్న బాక్సును ఊపడం వల్లే పేలుడు జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి పరుగుపరుగున చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు అతడిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారరు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పేలుడు బాంబు పేలుడా లేక రసాయనిక చర్య కారణంగానే పేలుడు జరిగిందా అనేది దర్యాప్తులో తేలనుందని చెప్పారు. 


నాలుగు నెలల క్రితం నల్గొండలో భారీ పేలుడు..


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలో ఆగస్టు 25వ తేదీన భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు ధాటికి పక్కనున్న పల్లె వాసులంతా ఉలిక్కి పడ్డారు. స్థానిక హిందీస్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం. 


హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన సమయంలో లోపల 8 మంది సిబ్బంది, కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారిని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు హుటాహుటినా అక్కడికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడ్డ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు, ప్రమాదాన్ని చూసిన వారు చెబుతున్నారు.