Hyderabad Crime : హైదరాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. ఇటీవలె ఓ బాలికపై కారులో అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే ఈ దారుణం వెలుగుచూసింది. ఇంట్లో గొడవ పడి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగింది? 


హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని ఓ కాలనీకి చెందిన బాలిక(14) ఈనెల 18న చాంద్రాయణగుట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. అయితే ఆ బాలిక అక్కడికి వెళ్లలేదు. బాలిక ఆచూకీ తెలియక పోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు చాంద్రాయణ గుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  ఆ మరుసటి రోజు ఆదివారం రాత్రి బాలికి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా తనపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘాజిమిల్లత్‌కాలని, హఫీజ్‌బాబానగర్‌ కాలనీలకు చెందిన ఇద్దరు యువకులు బాలికను 18వ తేదీ రాత్రి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరోజంతా బాలికను గుర్తుతెలియని ప్రదేశంలో బంధించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి తిరిగివచ్చింది. బాలిక చెప్పిన వివరాలతో పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికకు వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు అధికారికంగా వివరాలు తెలియజేయడానికి ఇష్టపడలేదు. దర్యాప్తు కొనసాగుతోందని వివరాలు చెప్పడానికి నిరాకరించారు. 


పబ్ లో యువతిపై దాడి


రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్టార్ హోటల్ పబ్ లో యువతిపై దాడి జరిగింది. ఈ మేరకు ఇరు వర్గాల నుంచి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ యువతి యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫిర్యాదులో నమోదైన వివరాల ప్రకారం.. న్యూట్రిషనిస్ట్, డైటిషన్ అయిన యువతిపై పబ్ లో బడా బాబుల పిల్లలు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ పబ్ లాంజ్ లో ఈ ఘటన జరిగింది.


బాధితురాలు ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్ళింది. ఆదివారం తెల్లవారుజామున పబ్ లోనే బాధితురాలిపై 8 మంది యువకులు అసభ్య ప్రవర్తన చేశారని ఆమె ఆరోపించింది. ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్ళపై యువకులు బాటిల్స్ తో విచక్షణ రహితంగా దాడి చేశారు. పబ్ లో ఉన్న సమయంలో బాధితురాలి దగ్గరికి వచ్చి నిందితులు ఆమె ఫోన్ నంబర్  అడిగారు. బాధితురాలు ఇవ్వను అని చెప్పడంతో అబ్రార్, సాధ్ అనే యువకులు ఆమెను పక్కకి తీసుకెళ్లారు. పదే పదే తమతో 8 మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. రేప్ చేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాలో పేర్కొంది. అడ్డు వచ్చిన స్నేహితురాళ్లపై  మద్యం సీసాలతో దాడి చేశారని వెల్లడించింది. అడ్డుకోబోయిన పబ్ నిర్వహకులపైనా యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వివరించింది.