హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వేసవికాలం మొదలైనప్పటి నుంచీ కుక్కల బెడద మరింత అధికమైంది. నగరంలో ఓ బాలుడ్ని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఆపై ఖమ్మం జిల్లాలో, ఇటీవల హన్మకొండలోనూ వీధి కుక్కలు దాడి చేయడంలో పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క దూసుకురావడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కాపాడుకునేందకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్‌ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 


అసలేం జరిగిందంటే..
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ పంచవటి కాలనీ ఉంది. ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే కుటుంబ అమెజాన్ లో ఓ ప్రొడక్ట్ ఆర్డర్ చేసింది. అది డెలివరీ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ మూడో అంతస్తు ఎక్కగా.. అక్కడ ఉన్న ఓ పెంపుడు కుక్క యువకుడి మీదకు దూసుకొచ్చింది. భయాందోలనకు గురైన డెలివరీ బాయ్ ప్రాణ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకి దూకేశాడని స్థానికులు తెలిపారు. డాబర్ మెన్ డాగ్ మీదకు దూసుకురావడంతో కరుస్తుందేమోనన్న భయంతో కిందకి దూకిన డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గాయపడ్డ యువకుడ్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


ఆ ఇంటి ఓనర్ ఈ ఘటనపై స్పందించారు. తాము ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో బెడ్ బుక్ చేశామని తెలిపారు. తమ ఫ్లాట్ కు వచ్చే కొంత సమయం ముందు డెలివరీ బాయ్ కాల్ చేశాడు. 5 నిమిషాల్లో వస్తానని ఫోన్ లో చెప్పాడన్నారు. డెలివరీ బాయ్ కోసం ఎదురుచూశాం, ఆ యువకుడ్ని చూసి మా పెంపుడు కుక్క అరిచింది. దాంతో డెలివరీ బాయ్ భయపడ్డాడు. కుక్క కరుస్తుందని భయంతో యువకుడు గోడ ఎక్కి దూకేశాడు. అయితే కుక్క కరవదని మేం చుబుతూనే ఉన్నాం, కానీ అతడు భయంతో కిందకు దూకాడని బెడ్ ఆర్డర్ చేసిన ఆ ఇంటి ఓనర్ తెలిపారు.


వరుసగా కుక్కల దాడులు, బలవుతున్న చిన్నారులు!
కొన్ని నెలల కిందట హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది. బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్(5) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అంతలో వీధి కుక్కలు భరత్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందడం తెలిసిందే. రెండు రోజుల కిందట  హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట రైల్వే ఆవరణంలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడిని కుక్క కరిచింది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటున్న టైంలో కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడు స్పాట్‌లోనే చనిపోయాడు.