Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది.  ఐదుగురు కుమార్తెల తండ్రి.. తనకు పుట్టబోయే బిడ్డ లింగాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. కొడుకు కావాలనే కోరికతో  ఆ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.. ఎనిమిది నెలల గర్భిణి అయిన తన భార్య కడుపు కోశాడు. నిందితుడు కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లా లేక మగబిడ్డ అనే విషయాన్ని పరిశీలించడానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య అనుమతి లేకుండానే సదరు వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడు. కొడవలితో కడుపు కోశాడు. చంపేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ ఘటన  2020లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.  న్యాయమూర్తి సౌరభ్ సక్సేనా ఈ నాలుగేళ్ల నాటి కేసులో నిందితుడైన భర్తను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు .. అలాగే రూ.50 వేలు జరిమానా విధించారు. ఇక తన జీవితమంతా జైలులోనే గడుపుతాడు. 


సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యక్తిని పన్నాలాల్‌గా గుర్తించారు. పన్నాలాల్ పదునైన ఆయుధంతో భార్య(35) పొట్టను కోసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఘొంచా గ్రామానికి చెందిన గోలు 2020 సెప్టెంబర్ 19న సివిల్ లైన్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తన సోదరి అనితకు 22 సంవత్సరాల క్రితం మొహల్లాలో నివసిస్తున్న నంద్ లాల్ కుమారుడు పన్నా లాల్‌తో వివాహం జరిగిందని చెప్పాడు.  అనిత ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అందుకే పన్నా లాల్ ఎప్పుడూ ఆమెపై కోపంగా ఉండేవాడు. అనితను పలుమార్లు వేధించడంతోపాటు బెదిరించాడు. ఈ విషయాన్ని అనిత తన పుట్టింటికి తెలియజేసింది. పన్నా లాల్‌ని పలుమార్లు ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన అంగీకరించలేదు. అనిత ఆడపిల్లలకు జన్మనిస్తే ఉంచుకోనని, వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు.


అనిత ఎనిమిది నెలల గర్భిణి. సెప్టెంబర్ 22న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పన్నా లాల్ అనితకు ఆడపిల్ల మాత్రమే పుడుతుందని చెప్పాడు. కావాలంటే పొట్ట కోసి చూడు అది అమ్మాయా లేదా అబ్బాయా అని కొడవలి తీసుకుని అనిత వైపు కదిలాడు. అనిత అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. హత్య చేయాలనే ఉద్దేశంతో కొడవలితో ఆమె కడుపు కోశాడు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో బరేలీలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 


నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తులో కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయడానికి ప్రయత్నించి, ఆమెను చంపడానికి ప్రయత్నించినట్లు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. అప్పటి నుంచి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. గురువారం పైన పేర్కొన్న ఫైల్‌లోని సాక్ష్యాలను పరిశీలించి, ఏడీజీసీ మునేంద్ర ప్రతాప్ సింగ్.. డిఫెన్స్ న్యాయవాది వాదనలు విన్న  న్యాయమూర్తి నిందితుడు పన్నా లాల్‌కు శిక్ష విధించారు.
 
 సురేష్ రైనా భార్య ట్వీట్  
బదౌన్‌లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో భారత క్రికెటర్ సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి రైనా స్పందించారు. ట్విటర్లో ఈ ఘటనపై  ట్వీట్ చేశారు. "ఇంతకంటే భయంకరమైనది మరొకటి ఉండదు." అబ్బాయి కావాలనే ఈ దురాశ ఎప్పుడు తీరుతుంది? తల్లి ప్రాణం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విషయం చాలా భయంకరమైనది. ఈ ఘటనలో మహిళ జీవన్మరణ మధ్య పోరాడుతోందని రాసుకొచ్చారు.