Husband Plots Wifes Murder with Contract Killers | సంగారెడ్డి: తన చేతికి మట్టి అంటకుండా భార్యను వదిలించుకోవాలని చూసిన ఒక భర్త చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన సుపారీ గ్యాంగ్‌తో కలిసి భార్యను దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. గుర్తుతెలియని వ్యక్తులు తన కళ్లెదుటే భార్య గొంతు కోసి చంపారంటూ భర్త ఆడింది నాటకమేనని పోలీసులు ఒక కూరగాయల సంచి ఆధారంగా తేల్చారు. మే 30వ తేదీన ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వివాహిత మీనాదేవి (35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 

Continues below advertisement

సినిమా తరహా కట్టుకథపోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన అనిల్‌కుమార్, మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనిల్ ఇనుము పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ, వాహనాలను అద్దెకు ఇస్తుంటాడు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో భార్యను హత్య చేయాలని ప్లాన్ చేసిన  అనిల్, ఇందుకోసం బిహార్ నుంచి నలుగురు నిందితులతో సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు.

ప్లాన్ ప్రకారం మే 30 సాయంత్రం భార్యతో కలిసి మార్కెట్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆగిపోయిందని, తాను రిపేర్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి మీనాదేవిని పొదల్లోకి లాక్కెళ్లి గొంతుకోసి చంపారని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానూ అడ్డుకోబోతే తనపై కత్తులతో దాడి చేశారంటూ ఏడ్చి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు.

Continues below advertisement

అనుమానం తెప్పించిన అనిల్ ప్రవర్తనఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనిల్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతడి శరీరంపై ఉన్న గాయాలు వేరొకరు దాడి చేసినట్లు కాకుండా, స్వయంగా బ్లేడు లేదా కత్తితో కోసుకున్నట్లుగా ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

నిందితులను పట్టించిన కూరగాయల సంచిఈ కేసును ఛేదించడంలో ఒక కూరగాయల సంచి కీలక ఆధారంగా మారింది. వీరిద్దరూ మార్కెట్ నుంచి వస్తున్నప్పుడు ఆ సంచి మీనాదేవి చేతిలోనే ఉందని అనిల్ చెప్పాడు. ఒకవేళ అకస్మాత్తుగా దాడి చేసి, ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్తే చేతిలోని సంచి కిందపడి కూరగాయలు చెల్లాచెదురు అవ్వాలి. కానీ, అక్కడ కూరగాయల సంచి ఓ మూలన నీట్‌గా పెట్టి ఉంది. ప్రాణాల కోసం పోరాడే మహిళ సంచిని అంత జాగ్రత్తగా పెట్టే అవకాశం లేదని గ్రహించిన  పోలీసులకు అనిల్ ఆడుతున్న డ్రామా స్పష్టమైంది.

దీనిపై గట్టిగా నిలదీయడంతో తానే సుపారీ గ్యాంగ్‌ను పిలిపించి భార్యను చంపించినట్లు అనిల్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అనిల్‌తో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు బిహార్ నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు.