కర్ణాటక రాష్ట్రంలో‌ పరువు హత్య కలకలం రేపుతోంది. దళిత యువకుడిని కుమార్తె ప్రేమించిందనే కోపంతో ఏకంగా కన్న కూతురినే గొంతు‌ కోసి హత్య చేసిన ఘటన కోలార్ జిల్లా,‌ బంగారుపేట బోడగుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. ఇటు ప్రియురాలు హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న యువకుడు రైలు క్రింద పడి‌ ప్రాణాలు విడిచాడు.. దీంతో‌ బంగారుపేటలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


వివరాల్లోకి వెళ్ళితే.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా,‌ బంగారుపేటలోని బోడగుర్కి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కూతురు కీర్తి డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ ఆమెకు చాలా క్రితం పరిచయం అయ్యాడు. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ఈ విషయం‌ కీర్తి తండ్రి క్రిష్ణమూర్తికి తెలిసింది. దీంతో ఆయన‌ కీర్తిని‌ మందలించి, గంగాధర్ కు వార్నింగ్ ఇచ్చాడు. కానీ గంగాధర్, కీర్తీ ఇద్దరూ కలిసి తిరుగుతూ‌ ఉండడాన్ని తెలుసుకున్న క్రిష్ణమూర్తి.. గంగాధర్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. 


ఇంకోసారి తన కుమార్తెతో తిరిగితే ఊరుకునేది లేదంటూ గంగాధర్ ను హెచ్చరించాడు. దీంతో కీర్తి తన ప్రేమ‌ వ్యవహారాన్ని తండ్రి వద్ద తీసుకుని వచ్చి, తాను గంగాధర్ నే వివాహం చేసుకుంటానంటూ తేల్చేసింది. అయితే కులం వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మరోపక్క ఈ ప్రేమ వ్యవహారం గ్రామంలో తెలియడం, వీరు ఇంటిని నుంచి వెళ్లిపోతే ఊర్లో పరువు పోయిందని భావించిన తండ్రి కృష్ణమూర్తి, కీర్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. 


ప్రేమించిన యువతి మరణవార్త తెలుసుకున్న గంటల వ్యవధిలోనే ప్రియుడు గంగాధర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దగ్గర్లోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు కృష్ణమూర్తిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.