చిన్న చిన్న కారణాల వల్ల ఘర్షణ తలెత్తి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు యువకులు. అంతటితో ఆగకుండా వాటిని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి కర్రతో, కత్తులతో దాడి చేసుకుంటున్నారు. ఇరువర్గాలు మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే. 


ఆకివీడు ఇరువర్గల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకివీడు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన తెలగపాముల(గుంపు) యువకులు కొందరు జాతీయ రహదారిపై భీమవరం రోడ్డు కూడలి వద్ద స్థానిక ముఠా కార్మికులతో గొడవపడ్డారు.


ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జాతీయ రహదారిపై సుమారు 25 నిమిషాల పాటు ఘర్షణ కొనసాగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన 9 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగబాబు అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని ఏలూరు, మరికొందరిని భీమవరం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగబాబు తెలిపారు.


ఇటీవల కొన్ని సంఘటనలు


యువకులు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్న ఘటనలో పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. స్థానికుల కథనం ప్రకారం..మంగళవారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులో కొందరు యువకులు ఒక యువకుడిపై దాడి చేశారు. దీంతో ఆ యువకుడి స్నేహితులు బుధవారం దాడికి పాల్పడిన వ్యక్తిని మూలగుంటపాడులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఉన్న జిమ్‌లో ఉండగా దాడి చేశారు. ఆ సమయంలో జిమ్‌ చేస్తున్న వ్యక్తి తన చేతిలో ఉన్న వస్తువులతో తనపై దాడికి పాల్పడిన యువకులను కొట్టడంతో కొంత మందికి తలకు గాయాలయ్యాయి. యువకునిపై దాడి విషయం తెలుసుకున్న అతని స్నేహితులు కూడా రావడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


నేరడికొండ మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల రంగప్రవేశంతో వివాదం ముగిసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని రెండు రోజుల కిందట ప్రారంభించారు. ఈ దేవాలయానికి సంబంధించి రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రధాన సెంటర్‌లో ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. అరుపులు, కేకలు, తోపులాట మధ్య వివాదం తారాస్థాయికి చేరుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.


 అదిలాబాద్ గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ మధ్య గత కొన్నేండ్లుగా పాత కక్షలతో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల గ్రామంలో పోలీసుల అనుమతులు లేకుండా  ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని ఒక వర్గం వారు అభ్యంతరం తెలుపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.