Haryana woman kills 4 children: తన కంటే అందంగా ఉన్నారని పిల్లల్ని ఎవరైనా ముద్దు చేస్తారు కానీ ఈ మహిళ మాత్రం వాళ్లను చంపేస్తుంది. తన బిడ్డతో సహా నలుగుర్ని చంపిన తర్వాత పోలీసులకు దొరికింది కానీ .. అలా దొరకకపోతే ఇంకెంత మంది చనిపోయేవారో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది.
హర్యానాలో ఒక 32 ఏళ్ల మహిళ నలుగురు పిల్లలను హత్య చేసిన ఘటన షాకింగ్‌గా మారింది. తన కుమారుడైన శుభంను కూడా చంపేసిన ఈ మహిళ..మరో ముగ్గురు ఆడపిల్లలను కూడా చంపేసింది. కారణం ఏమిటంటే .. వారు అందంగా ఉన్నారట. తన కంటే అందంగా ఉన్నారనే ఈర్ష్యతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పానిపట్ పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. పిల్లల మరణాలను ప్రమాదాలుగా భావించి అంత్యక్రియలు చేసిన కుటుంబాలు పోలీసులు అసలు నిజం బయట పెట్టడంతో షాక్‌కు గురయ్యాయి.
పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) ప్రకారం ఈ మహిళ గత రెండు సంవత్సరాల్లో నలుగురు పిల్లలను చంపేసింది. 2023లో సోనీపట్‌లోని భవార్ గ్రామంలో తన మూడు ఏళ్ల కుమారుడు శుభంతో పాటు మరొక బాలికను హత్య చేసింది. ఈ ఘటనలు ప్రమాదాలుగా కనిపించేలా చేసింది. దీతో ఆయా కుటుంబాలు అంత్యక్రియలు చేశాయి. ఈ ఏడాది ఆగస్టులో పానిపట్‌లోని సివా గ్రామంలో మరొక ఆరేళ్ల బాలికను చంపింది. డిసెంబర్ 2న మరో ఆరేళ్ల బాలికను హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అన్ని మరణాలు ఈ మహిళ చేతిలోనే జరిగినట్లు తేలింది.
మహిళ హత్యలు చేసిన తీరు భయానకంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల అనుమానం రాకుండా చంపేస్తోంది. అయితే తన కుమారుడు ఓ పిల్లను చంపుతూండగా చూశాడని అతన్ని కూడా చంపేసిందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు లభించిన డైరీలో కొన్ని వివరాలు లభ్యమయ్యాయి. అందమైన బాలికలను చూస్తుంటే అసూయ కలుగుతుంది. వాళ్లు పెద్దయిన తర్వాత మరింత అందంగా అవుతారు.. తన కంటే అందంగా అవుతారు.. అందుకే చంపేశాను అని ఆమె డైరీలో రాసుకుంది. పోలీసులు ఆమెను ప్రశ్నించినప్పుడు అందమైన బాలికలంటే తనకు ఇష్టం లేదని చెప్పింది.
2019లో సోనీపట్‌లోని భవార్ గ్రామంలో వివాహం అయిన తర్వాత ఆమెకు ఈ అందం ఫోబియా ప్రారంభమయింది. ఆమె స్వచ్ఛందంగా మునుపటి హత్యలను కూడా ఒప్పుకుంది. ఇక ఇలా చేయలేనని, శిక్ష అనుభవించాలనుకుంటున్నానని చెప్పింది. పోలీసులు మునుపటి మరణాలపై కొత్త కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.