ATM Robbery In Kerala | నమక్కల్: ఇలాంటి సీన్ సినిమాల్లో చూసింటారు. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి చోరీ ఘటన కాదు. దొంగల ముఠా కోసం ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్ కౌంటర్ కు దారితీసి, అందులో ఓ దొంగ హతమయ్యాడు. మరో నిందితుడికి గాయాలయ్యాయి. కేరళలో జరిగిన ఏటీఎం చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. 


పక్కా స్కెచ్ వేసి ఏటీఎంలలో చోరీలు


హరియాణాకి చెందిన ఓ దొంగల ముఠా ఇటీవల కేరళకు వెళ్లి ఏటీఎంలో దొంగతనం చేసింది. సినిమా సీన్ తరహాలో చేజింగ్ జరిగి అది ఎన్ కౌంటర్ వరకు వెళ్లింది. కేరళలో ఏటీఎంలో రాబరీ చేసిన హరియాణా గ్యాంగ్ చివరకు తమిళనాడులో పట్టుబడింది. ఒక్క చోరీ ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేరళలోని త్రిసూర్‌లో ఆరుగురు దొంగలు ప్లాన్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM)లో చోరీ చేశారు. అక్కడి నుంచి దొంగల ముఠా తమిళనాడుకు పారిపోయింది. కానీ అప్పటికే కేరళ పోలీసుల నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నమక్కల్ జిల్లాలో దొంగల కోసం కాపు కాశారు. ఓ లారీ కంటైనర్ పోలీసులు సిగ్నల్ ఇస్తున్నా ఆపకుండా వెళ్లిపోయింది. దాంతో పోలీసులు సినిమా సీన్ తరహాలో చోరీ గ్యాంగ్‌ను ఛేజ్ చేశారు. చివరగా పోలీసులు తమను చుట్టుముట్టారని, దొంగల ముఠా కాల్పులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  ఎదురు కాల్పులు జరపగా ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా... మరో నిందితుడికి గాయాలయ్యాయి. ఈ ఛేజింగ్ క్రమంలో ఓ పోలీస్‌కి కూడా గాయాలయ్యాయి. ఏటీఎంలో చోరీ చేసిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని త్రిసూర్‌లో దాదాపు మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 65 లక్షల నగదుని దోచుకెళ్లారు. శుక్రవారం వేకువజామున 2:30 నుంచి 4 గంటల సమయంలో ఈ హరియానా దొంగలు ఏటీఎంలను కొల్లగొట్టారు. చోరీ చేసిన డబ్బును ఓ కారులో దాచి, ఆ కారును లారీ కంటైనర్ లో ఎక్కించి తమిళనాడు వైపు పరారయ్యారు. ఓ వైపు కేరళ పోలీసుల నుంచి సమాచారం అందడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు చెక్‌పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు కంటెయినర్‌ని ఆపే ప్రయత్నం చేయగా.. చోరీ గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది.


Also Read: Crime : 69 ఏళ్ల వయసులో పెళ్లి కోసం ఆశపడ్డాడు - ఓ మహిళ కూడా రెడీ - అక్కడే అసలైన ట్విస్ట్


చివరికి పోలీసుల ఛేజ్ లో దొరికిపోతున్నామని తమపై కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఓ నిందితుడు చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. నిందితుల వద్ద తుపాకులు, గ్యాస్ కట్టర్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నమక్కల్ పోలీసులు తెలిపారని కేరళ మీడియా రిపోర్ట్ చేసింది.


Also Read: RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు