Adani Group To Pay For AAI: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కోసం భారీ ఖర్చు ఎదురు చూస్తోంది. గ్రూప్‌లోని 'అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్' (Adani Airports Holdings Ltd), 'ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'కు (AAI) సుమారు రూ. 2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2021 నాటి ప్రైవేటీకరణకు సంబంధించి ఈ డబ్బు చెల్లించాలి. 


ప్రైవేటీకరణలో భాగంగా... అహ్మదాబాద్, జైపుర్, గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2021లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డబ్బును అదానీ గ్రూప్‌ చెల్లించాల్సి ఉంది. 


వైట్‌ ఎలిఫెంట్‌ నిర్వహణలో విమానాశ్రయాలు
ప్రస్తుతం, ఈ విమానాశ్రయాల బాధ్యతలను 'అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్' చూస్తోంది. ఈ కంపెనీని అదానీ గ్రూప్‌లోని 'వైట్‌ ఎలిఫెంట్‌' అని పిలుస్తుంటారు. రూపాయి ఆదాయం లేకపోయినా నిర్వహణ ఖర్చులు తడిసిమోపడవుతుంటే, దానిని 'తెల్ల ఏనుగు'తో పోలుస్తారు.


2021 కంటే ముందు ఈ విమానాశ్రయాలు AAI చేతిలో ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణీకుల్లేక ఎయిర్‌పోర్ట్స్‌ కళ తప్పాయి. రాబడి లేక AAI ఈగలు తోలుకుంటూ కూర్చుంది. ఆ సమయంలో (2021 నవంబర్‌లో), అదానీ గ్రూప్‌ సీన్‌లోకి ఎంటరైంది. అహ్మదాబాద్, జైపుర్, గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూరు విమానాశ్రయాల తాళాలు తీసుకుంది. ఇందుకోసం, అప్పట్లోనే AAIకి రూ.2,440 కోట్లు చెల్లించింది. ఇంకా, రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. 


2019-2021 కాలంలో ఈ 3 విమానాశ్రయాల అభివృద్ధి కోసం AAI పెట్టిన పెట్టుబడులు & చేసిన ఖర్చులు కూడా రూ.2,800 కోట్లలో కలిసి ఉన్నాయి. ఈ వార్త నేషనల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ, అదానీ గ్రూప్‌గానీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగానీ ఈ వార్త రాసే సమయానికి స్పందించలేదు.


డబ్బు చెల్లించడానికి అప్పు
AAIకి డబ్బు చెల్లించడానికి అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 2,000 కోట్ల అప్పు తీసుకుంటుందని, మిగిలిన డబ్బును గ్రూప్ ఫండ్స్‌ నుంచి తీసుకుంటుందని సమాచారం. మన దేశంలో, విమానాశ్రయ ఆపరేటర్ల ఆదాయాలను (విమానాశ్రయాలు వసూలు చేసే సుంకాలు) ముందుగానే నిర్ణయిస్తారు. విమానాశ్రయాల ఫీజ్‌ల పేరిట, ఐదేళ్ల కాలానికి నిర్ధిష్ట రేట్లను నిర్ణయిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు దీనికి మించి వసూలు చేయడానికి వీల్లేదు.


విమానాశ్రయాలు.. విమానాల ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు, యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు వంటి వివిధ టారిఫ్‌లను వసూలు చేస్తుంటాయిు. ఈ టారిఫ్‌ రేట్లను ఎయిర్‌పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) నిర్ణయిస్తుంది. AAI రూల్స్‌ ప్రకారం.. ఐదేళ్ల వ్యవధిలో వాస్తవంగా వచ్చి ఆదాయం 'హామీ ఉన్న రాబడి' కంటే తక్కువగా ఉంటే, ఆపరేటర్లు 'అండర్ రికవరీ' కిందకు వెళ్తారు. ఆ నష్టాలను భర్తీ చేయడానికి ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు మరో ఐదు సంవత్సరాల పాటు టారిఫ్‌లను పెంచుకోవచ్చు.


ఒకవేళ విమానాశ్రయాలను ప్రైవేటీకరించకపోతే, గత ఐదేళ్లలో కోల్పోయిన ఆదాయాన్ని టారిఫ్‌ల పెంపు ద్వారా వచ్చే ఐదేళ్ల కాలంలో తిరిగి పొందేందుకు AAIకి అవకాశం ఉండేది. ఇప్పుడు, అదానీ గ్రూప్‌ ఆ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది కాబట్టి, కోల్పోయిన ఆదాయాన్ని AAIకి అదానీ గ్రూప్‌ చెల్లించాల్సి ఉంటుంది.


AAIకి చెల్లించే ఖర్చులను భర్తీ చేసుకునేందుకు టారిఫ్‌లు పెంచుకోవడానికి అదానీ గ్రూప్‌నకు అనుమతి ఉంది. వచ్చే 3-6 సంవత్సరాల్లో అదనపు టారిఫ్‌లతో ఈ ఖర్చులను అదానీ గ్రూప్‌ తిరిగి పొందుతుంది.


మరో ఆసక్తికర కథనం: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!