Stampede at Mansa Devi Temple | హరిద్వార్: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లోని మన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాటతో విషాదం నెలకొంది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

హరిద్వార్‌లోని కొండ ప్రాంతంలో ప్రసిద్ధ మన్సా దేవి ఆలయం ఉంది. కేబుల్ కార్ల ద్వారా లేదా మెట్ల ద్వారా మాత్రమే ఆ ఆలయానికి చేరుకోవచ్చు. ఆదివారం నాడు శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. చాలా మంది కాన్వారీలు ఈ ఆలయాన్ని సందర్శించారు. తొక్కిసలాట బాధితులలో వారు సైతం ఉన్నారు. 

తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం ధామీ..

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితొక్కిసలాటపై స్పందించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక పోలీసులు,  ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మన్సా దేవి ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. తాను స్థానిక అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నానని, పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు.