అసలే కష్టాల్లో ఉన్న కుటుంబం.. ఇంటికి పెద్ద దిక్కు లేడు. మూడేళ్ల క్రితమే చనిపోయాడు. ఇంతో మరో ఘోరం. చేతికి అంది వచ్చిన కొడుకు మరణం. అది కూడా ఆర్థిక సమస్యల కారణంగా. వరుసగా కుటుంబంలోని విషాదాలతో ఆ తల్లీ బాధ వర్ణనాతీతంగా మారింది. లోన్ యాప్ నిర్వహకుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరోటి జరిగింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారు ఏ దారి లేని పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది వాటి ఉచ్చులోనే చిక్కుకొని, వేధింపులు భరించలేక తనువు చాలిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా హన్మకొండ జిల్లాలో జరిగింది.


హన్మకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన సంది స్వరూప - చొక్కారెడ్డి దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం చొక్కారెడ్డి మృతి చెందాడు. గత ఏడాది కుమార్తె శ్రావణి వివాహం జరిపించారు. కుమారుడు హైదరాబాద్‌ మాదాపూర్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శ్రావణ్‌ రెడ్డి ఆరు నెలల క్రితం ఓ లోన్‌ యాప్‌ ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకున్నట్లు సమాచారం. కిస్తీలు సకాలంలో కట్టకపోవడంతో రుణ యాప్ యాజమాన్యం నుంచి వేధింపులు మొదలయ్యాయి.


‘డబ్బులు చెల్లించకుంటే పరువు తిస్తాం.. సోషల్ మీడియాలో నీ ఫోటోలు పెడతాం’


డబ్బులు మొత్తం చెల్లించకపోతే పరువు తీస్తామని, న్యూడ్ ఫొటోలు షేర్‌ చేస్తామని గత నెల రోజులుగా సంబంధిత ఎజెంట్స్ బయపెట్టారు. ఏం చెయ్యాలో అర్థం కాక శ్రావణ్‌ రెడ్డి మానసికంగా వేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లోని ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


అప్రమత్తత అవసరం - పోలీసులు


అధిక వడ్డీల పేరుతో ప్రజలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా వేధింపులు ఆపడం లేదు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రుణ యాప్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని చెబుతున్నారు. అలాగే ఏదైనా ఆన్ లైన్ యాప్ ఏజెంట్ లు వేధింపులు మొదలు పెడితే.. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు.