Gutarat Violent Protest: 



జునాగఢ్‌లో ఘటన..


గుజరాత్‌లోని జునాగఢ్‌లో యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. మసీదుని అక్రమంగా నిర్మించారని నోటీసులు రావడంపై స్థానిక ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 500-600 మంది రోడ్లపైకి వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు విసిరారు. జూన్ 16న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ అల్లర్లు జరిగాయి. మజేవాది గేట్‌ ముందు ఓ మసీదుని అక్రమంగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని 5 రోజుల్లో సమర్పించాలని తేల్చి చెప్పారు. ఆ గడువు ముగిసిపోవడం వల్ల కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఓ టీమ్‌ అక్కడికి వచ్చి మసీదుని కూల్చే ప్రయత్నం చేసింది. ఇది చూసిన వెంటనే పెద్ద ఎత్తున ముస్లింలు అక్కడికి వచ్చారు. పోలీసులపై రాళ్లు విసరడం మొదలు పెట్టారు. అక్కడి వాహనాలకు నిప్పంటించారు. ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు ANI న్యూస్ ఏజెన్సీ ట్విటర్‌లో షేర్ చేసింది. జునాగడ్ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం...ఒక్కసారిగా 174 మంది పోలీసులను చుట్టుముట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మొహరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ కట్టడాన్నైనా కూల్చేందుకు వెనకాడడం లేదు. మసీదుని కూడా ఓ ఆక్రమిత స్థలంలో కట్టారని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. 


"మజేవాది గేట్ ముందున్న మసీదుని అక్రమంగా నిర్మాణంగా జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ తేల్చింది. దీనిపై ఆ మసీదుకి నోటీసులు ఇచ్చింది. ఐదు రోజుల్లోగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పింది. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మేమంతా స్పాట్‌కి వెళ్లగానే ఒక్కసారిగా 500-600 మంది గుమిగూడారు. రోడ్‌లను బ్లాక్ చేయొదన్ని చాలా సేపు రిక్వెస్ట్ చేశాం. అయినా వాళ్లు వినలేదు. మాపై రాళ్లు విసిరారు. ఈ దాడుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం"


- రవితేజ వశంశెట్టి, జునాగఢ్ ఎస్‌పీ