రుణ యాప్‌లు పెడుతున్న వేధింపులు, దారుణాలు ఇంకా ఆగడం లేదు. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదంటూ తొలుత జనాల్ని ఆకర్షించి, ఆ తర్వాత గడువులోపు కట్టకపోతే వారిని అన్ని రకాలుగా వేధించి డబ్బులు రాబట్టుకుంటున్నారు. ఆ సమయంలో డబ్బు లేని వారు మాత్రం వారి మానసిక వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సంభవించినప్పుడు ఆర్థిక సమస్యలతో ఇలాంటి యాప్‌ల ద్వారా చాలా అప్పులు చేశారు. గడువులోపు కట్టలేకపోవడంతో బాధితుల ఫోన్ నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించి, అన్ని రకాల మానసిక ఇబ్బందులకు గురి చేశారు. ఈ బాధలు తట్టుకోలేక సాధ్యమైన వారు అప్పు చెల్లించేయగా, వీరు కాని వారు దిక్కు తోచని పరిస్థితుల్లో, బంధువర్గంలో తమ పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారు.


మంగళగిరిలో వివాహిత ఆత్మహత్య
తాజాగా ఇలాంటి రుణ యాప్ ల వేధింపులకు ఓ వివాహిత బలి అయింది. మంగళగిరి మండలం చినకాకానికి వివాహిత సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటి పైన ఇనుప ఫ్లెక్సీ ప్రేమ్ కు చీరతో ఉరి బిగించుకొని ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు బాధితురాలు తన తల్లిదండ్రులు, భర్తను గుర్తు చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియో పంపింది. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, తనకు బతకాలని ఉందని, చావుకు చాలా ధైర్యం కావాలని సెల్ఫీ వీడియోలో ఆమె రోదిస్తూ చెబుతుండడం రుణ యాప్‌ల వేధింపుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.


మృతురాలు పుట్టినిల్లు మచిలీపట్నం శారదా నగర్ కాగా, ఆమె భర్త కృష్ణా జిల్లా గంటశాల మండలానికి చెందిన వారు. ఓ ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం వీరికి పెళ్లి కాగా, చినకాకనిలో నివాసం ఉంటున్నారు. మృతురాలు ఇటీవల ఇండియన్ బుల్స్, రూపీ ఎక్స్ ఎమ్ రుణ యాప్స్‌లో 20 వేలు లోన్ తీసుకోగా ఇంకో రూ.8 వేలు బకాయి ఉంది. అవి కట్టేయాలని రెండు రోజుల నుండి ఆమెకు రుణ యాప్ ల కాల్ సెంటర్స్ నుండి వేధింపులు ఎక్కువయ్యాయి. 


వాట్సప్‌ కాంటాక్ట్స్‌కు అసభ్య మెసేజ్‌లు
న్యూడ్ ఫోటోలు నీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ కు పెడతామని వారు బెదిరింపులు చేశారు. దాంతో భయపడిపోయి, తీవ్ర మానసిక వేదనకు గురి అయిన బాధితురాలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఉదయం నుండి ఆమెకు ఫోన్, వాట్సాప్‌కు కాల్ సెంటర్స్ నుంచి వేధింపుల కాల్స్ ఆగకుండా వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్‌లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్స్ కు ఆమెను అసభ్యంగా కించపరుస్తూ రుణ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు పంపారు. అవి చర్చించలేని విధంగా దారుణంగా ఉన్నాయి.


9745211357 సెల్ నెంబర్ నుంచి వేధింపులు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. విపరీతంగా కాల్స్ వస్తుండడంతో ఆమె భర్త ఫోన్ ఎత్తగా, ఫలానా లింక్ ద్వారా డబ్బు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో భర్త మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.