Guntur News : గుంటూరుకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత శనక్కాయల అరుణ కుమారుడు పసిపిల్లల విక్రయం కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండటంతో ఈ విషయం కలకలం రేపుతోంది. ఉమాశంకర్ గుంటూరులోని కొత్తపేటలో అహల్య ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన కోసం ఏలూరు పోలీసులు గాలిస్తున్నారు. పసిపాప విక్రయం వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకుని ఆయన పరారైనట్లుగా తెలుస్తోంది.


ఏలూరు పసిపాప గుంటూరులో విక్రయం


ఏలూరులో ఆగస్టు 2 శిశువు విక్రయానికి సంబందించిన కేసు నమోదైంది. పోలీసులు మొత్తం వివరాలు ఆరా తీస్తే గుంటూరు నగరంలోని కొత్తపేటకు చెందిన ప్రముఖ వైద్యుడి ప్రమేయం ఉన్నట్లుగా తేలింది.  ఆయన కోసం ఏలూరు టూటౌన్ పోలీసులు బుధవారం నగరానికి రావడంతో విషయం వెలుగుచూసింది. మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు  ఉమాశంకర్ ఈ కేసులో 11 వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు వెనుతిరిగారు.


కొనుగోలుదారులకు మధ్యవర్తిగా డాక్టర్ ఉమాశంకర్ ?


ఏలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఆమెకు వరసకు బావ అయ్యే యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి అయింది.  బాలిక ఏలూరు కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు విక్రయానికి పెట్టాడు. దీంతో అంగన్వాడీ ఆయా మేడంకి నాగమణి, విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన తీర్ధల దుర్గ, పాయకాపురానికికు చెందిన ముదావత్ శారద, మోఘలరాజపురానికి చెందిన చిలకా దుర్గాభవాని, గొల్లపూడికి చెందిన జి.విజయలక్ష్మి రంగంలోకి దిగి ఆ శిశువును రూ. 2 లక్షల 70 వేలకు ప్రత్తిపాడుకు చెందిన షేక్ గౌసియాకు విక్రయించారు.


ప్రస్తుతం పరారీలో ఉమాశంకర్ 


వంద రూపాయల స్టాంపు పేపరుపై విక్రయానికి సంబంధించిన ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఈ విషయం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కేవీవీఎల్ పద్మావతి దృష్టికి రావటంతో ఆమె ఏలూరు టూటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గత జూలై 28న పోలీసులు క్రైం నెంబరు 327/2022గా కేసు.. నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈ ముఠాను అరెస్టు చేశారు. అయితే ఇదే కేసులో నగరంలోని కొత్తపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు ఉమా శంకర్  ప్రమేయం ఉన్నట్లు ఏలూరు పోలీసుల విచారణలో తేలింది. ఏలూరులో శిశు విక్రయ సమాచారం ఆయన ద్వారానే గౌసియాకు తెలిసి ఉంటుందని అనుమానిస్తున్నారు.


సంతాన లేమి సమస్యల ఆస్పత్రి నిర్వహిస్తున్న ఉమాశంకర్ 


ఉమాశంకర్ నిర్వహించేది  సంతానలేమికి చికిత్స చేసే ఆస్పత్రి కావడంతో .. పిల్లలు పుట్టని దంపతుల కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి.. విక్రయానికి సహకరించినట్లుగా భావిస్తున్నారు. శనక్కాయ అరుణ బీజేపీలో ఉన్నారు. ఉమాశంకర్ కూడా బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ  అంశంపై బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు.