Guntur Crime News: బీటెక్ చదువుతున్న ఇద్దరు యువకులు చేస్తున్న పాడు పని ఇప్పుడు చర్చనీయాంశం అయింది. యువకులు ఏకంగా అమ్మాయిల ఫోటోలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు. అది కూడా ఆ ఫోటోలను అశ్లీల వెబ్‌ సైట్ల (Web Sites) వారికి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. గుంటూరు జిల్లా (Guntur District) ముప్పాళ్లకు (Muppalla) చెందిన ఇద్దరు యువకులు ఈ పనులు చేస్తున్నట్లుగా చాలా ఆలస్యంగా బయటికి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.


అయితే, తమ గ్రామంలోని యువకులే ఇలాంటి పాడు పనులకు పాల్పడుతుండడం తెలిసి గ్రామస్థులు అవాక్కయ్యారు. దీంతో అనుచిత పనులు ఆ గ్రామస్థుల్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. డబ్బుల్ని సంపాదించడం కోసం ఈ యువకులు అడ్డదారులు తొక్కి జల్సా చేస్తున్నట్లుగా గుర్తించారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు (B Tech Students) అడ్డంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో అమ్మాయిలు, మహిళల ఫొటోలను నీలి చిత్రాల వెబ్‌సైట్లకు విక్రయించడానికి అలవాటు పడ్డారు. గత కొంత కాలంగా వారు ఇలాంటి పనులు చేస్తూనే డబ్బులు సంపాదిస్తున్నారు. 


ఎలా బయటపడిందంటే..
ఈ యువకులు గత సంక్రాంతి సందర్భంగా వేరే ఊర్ల నుంచి సొంత ఊర్లకు వచ్చిన మహిళలు, యువతుల ఫోటోలు తీశారు. ఆ చిత్రాలను నీలి చిత్రాల వెబ్‌ సైట్లకు పంపారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే ఓ యువకుడు సంక్రాంతికి (Sankranthi Festival) తన ఊరికి వచ్చాడు. అలా వచ్చిన యువకుడు సోషల్ మీడియాలో (Social Media) ఓ వీడియోను చూసి అవాక్కయ్యాడు. ఏకంగా తన తల్లి ఫొటోతో అశ్లీల వీడియోను గమనించాడు. ఈ వీడియో గురించి ఆరా తీసిన క్రమంలో ఈ పని ఆ ఊరికి చెందిన ఇద్దరు యువకులే చేశారని వెలుగులోకి వచ్చింది. 


ఇంజినీరింగ్‌, ఫార్మసీ చదువుతున్న అమ్మాయిల ఫొటోలను కూడా మార్ఫింగ్‌ (Photo Morphing) చేసి నీలి చిత్రాల వెబ్‌ సైట్లలో పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. వెంటనే బాధితులు, వారి తల్లిదండ్రులు అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోవైపు, ఈ యువకుల గురించి తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తమ ఇంట్లోని ఆడవారి ఫోటోలను కూడా అలాగే వెబ్ సైట్లకు అమ్మారేమో అని కలవరపడుతున్నారు. ఆ వీడియోలు ఎవరి కంట పడతాయో అంటూ తీవ్ర వేదన చెందుతున్నారు.