ప్రశాంతతకు మారుపేరులా ఉన్న నెల్లూరు జిల్లా ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. తాను ప్రేమించిన అమ్మాయిని తుపాకితో కాల్చి హత్య చేసి, ఆపై తానూ హత్య చేసుకున్న ఓ సైకో లవర్ ఉదంతం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ఈ ఘటన జరిగింది. హంతకుడు వాడిన తుపాకీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అనే అక్షరాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే అది ఎక్కడిది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు. హంతకుడు సురేష్ కి ఎలా అందజేశారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మూడేళ్ల క్రితం 2018 నవంబర్ 3న నెల్లూరులో ఓ హత్య జరిగింది. 50ఏళ్ల మహేంద్ర సింగ్ అనే ఓ వ్యాపారిని ప్రత్యర్థులు తుపాకీతో కాల్చి చంపారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది. దుకాణం మూసి ఇంటికి తిరిగొస్తున్న మహేంద్ర సింగ్ ని బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దగ్గరనుంచి కాల్చి చంపారు. ఆ ఘటన తర్వాత పోలీసులు జిల్లాలో బందోబస్తు పెంచారు. మహేంద్ర సింగ్ ని అతని అన్న కొడుకు విక్రమ్ సింగ్ హత్య చేయించాడని తేల్చారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు.
అంతకంటే ముందు కూడా నెల్లూరులో అప్పుడప్పుడు తుపాకుల మోత వినిపించేది.
2013 జూలై 5న నెల్లూరు హాస్పిటల్ సమీపంలో పట్టపగలు మావోయిస్టు మాజీనేత, అమరవీరుల కుటుంబమిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు గంటిప్రసాద్ ను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ హత్య సంచలనంగా మారింది.
2015లో కావలికి చెందిన బంగారు వ్యాపారి రామయ్య, సునీల్ ని దొంగల ముఠా సభ్యులు తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. అదృష్టవశాత్తు అప్పుడు తుపాకుల్ని దుండగులు పేల్చలేదు, కేవలం బెదిరించడానికే వాడారు.
అదే ఏడాది భూవివాదం నేపథ్యంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరుకు చెందిన కిరణ్‌పై ఆయన సమీప బంధువు రూప్‌కుమార్ తుపాకీతోకాల్పులు జరిపారు. కిరణ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
2015 ఆగస్టు నెలలో నెల్లూరు నగరంలోని దేవిరెడ్డివారివీధిలో జయంతి జ్యూయలరీస్ లో దొంగలు పడ్డారు. పట్ట పగలే దుండగులు లోనికి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని తుపాకులతో బెదిరించి బంగారు దోచుకెళ్లారు.
గతంలో బిట్రగుంటలో టాస్క్ ఫోర్సు పోలీసులపై కొంతమంది దుండగులు తిరగబడి వారి వద్దనున్న తుపాకులను లాక్కెళ్లడం కూడా సంచలనంగా మారింది.
గతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు తుపాకుల్ని వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్దనుంచి మారణాయుధాలతోపాటు తుపాకుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఐదు తుపాకులు, ఇతర మారణాయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా జరిగిన హత్య, ఆత్మహత్య ఘటనతో మరోసారి నెల్లూరులో గన్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది లైసెన్స్ లేని గన్. ఇక లైసెన్స్ తుపాకీలను పోలీసులు మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలన్న నిబంధన ఉంది. తుపాకీనీ ఈ మధ్యకాలంలో ఏమైనా వినియోగించారా? ఎన్ని బుల్లెట్లున్నాయి. అనే విషయంపై ఆరా తీయాలి. అయితే ఈ ప్రక్రియ పక్కాగా జరుగుతుందా లేదా అనేది అనుమానమే. కేవలం ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లో పోలీసులు ఆయుధాలను జప్తు చేసుకుంటారు. మిగతా సమయాల్లో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఉదాహరణలు గుర్తు చేస్తున్నాయి.