Hyderabad Terrorist | అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ముగ్గురు ఉగ్రవాదులను ఆదివారం అరెస్ట్ చేసింది. ముగ్గురు ఉద్రవాదులలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. కాగా, అతడు డాక్టర్ కావడం కలకలం రేపుతోంది. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడని, ఐసిస్ సానుభూతి పరుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రసాయన పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
అహ్మదాబాద్ సమీపంలోని అదాలత్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఉగ్రవాదుల కుట్రకోణం వెలుగు చూసింది. ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్, మరో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్, ఆజాద్ సులేమాన్ షేక్‌లుగా గుజరాత్ ఏటీఎస్ గుర్తించింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఆదివారం నాడు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు దొరికిపోయారు.
ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్న హైదరాబాద్ డాక్టర్..
డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ తన ఇంటినే ప్రయోగశాలగా మార్చివేసి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, వాటి వ్యర్థాలతో ప్రమాదకర రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు సలీంఖాన్, సులేమాన్‌లు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో లాంటి పలు నగరాల్లో ఉగ్రదాడికి ప్లాన్ చేశారని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి పేర్కొన్నారు. డ్రోన్ల సాయంతో పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారని సలీంఖాన్, సులేమాన్ లను అరెస్ట్ చేయగా.. విషపూరితమైన ప్రమాదకర రసాయనాలు తయారుచేస్తున్నాడని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కీలకంగా ఉన్నాడని గుర్తించారు. వీరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడగా.. ఓ గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ డాక్టర్ తయారుచేసిన ప్రమాదకర రైసిన్ ద్వారా దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్రకు ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ పేర్కొంది.
ఆజాద్‌పై క్రిమినల్ కేసు నమోదు కాలేదు - సోదరుడుఆజాద్ సోదరుడు షెహజాద్ ప్రకారం, గుజరాత్ ATS నుండి ఫోన్ వచ్చింది. "మేము మీ సోదరుడిని పట్టుకున్నాము". నేను మాట్లాడమని చెప్పినప్పుడు, వారు రెండు మూడు గంటల తర్వాత మాట్లాడతామని చెప్పారు. అప్పటి నుండి, ఆజాద్‌తో లేదా ATS బృందంతో ఎటువంటి సంబంధం లేదు. తన సోదరుడిపై ఇక్కడ ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని షెహజాద్ తెలిపాడు.
ATS ద్వారా పట్టుబడిన ఆజాద్ తండ్రి సులేమాన్ మాట్లాడుతూ.. నా కొడుకు కష్టపడి పనిచేస్తాడు. తను బుధనాలోని ఒక మదర్సాలో కారియత్ చదువుతున్నాడు. అతను 6 లేదా 7 తేదీలలో ఇంటి నుండి వెళ్ళాడు. అక్కడ అతని మేనకోడలు, అతని పెద్ద సోదరుడి కుమార్తెను కూడా తీసుకువస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదన్నారు.