తిరుపతి జిల్లా (ఉమ్మడి నెల్లూరు జిల్లా) గూడూరు పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువకులు రోడ్డుపై వాహనం నడుపుతూ హల్ చల్ చేశారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడంతో కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా, దాదాపు 10 మందికి గాయపడ్డారు. గూడూరు స్టోర్స్ సూపర్ మార్కెట్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
గూడూరు పట్టణంలో కొందరు యువకులు కారు (AP 39 ME 2986)లో వెళ్తున్నారు. అప్పటికే మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. స్టోర్స్ సూపర్ మార్కెట్ వద్దకు రాగానే అతివేగంగా కారు నడపడంతో కొన్ని బైకులు నుజ్జునుజ్జు అయ్యాయి. కొన్ని బైకులను ఢీకొట్టిన తరువాత సైతం కారు కంట్రోల్ చేయకపోవడంతో మరికొందరు వాహనదారులను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు స్టోర్స్ ఎదుట నిలిచిపోయింది. దాదాపు 10 మంది వరకు గాయపడగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయని స్థానికులు తెలిపారు.
స్థానికుల ఆగ్రహం.. నిందితులను చితకబాది పోలీసులకు సమాచారం..
రోడ్డు ప్రమాదం సమయంలో తమ ప్రాణాలు పోతాయేమోనని గూడురు స్థానికులు ఆందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కారు ఆగిన వెంటనే స్థానికులు నిందితులను పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించి, అనంతరం వారికి నిందితులను అప్పగించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో కొంత సమయం అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
యువకులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ వద్ద కారు సెల్ఫ్ డ్రైవ్ కు తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. నలుపు రంగు చొక్కా ధరించిన యువకుడు కారు డ్రైవింగ్ చేశాడు. అతడితో పాటు కారులో ఉన్న యువకులంతా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు పోలీసులకు వివరించారు.
బాధితురాలు మాట్లాడుతూ.. కారు చాలా వేగంగా తమపైకి దూసుకొచ్చిందన్నారు. స్కూటీపై గూడురు స్టోర్ వద్దకు వచ్చామని, లోపలికి వెళ్లాలని చూస్తుండగానే కారు తమను ఢీకొట్టిందని చెప్పారు. అంతకుముందే మరో ఇద్దర్ని కారుతో ఢీకొడితే వారు ఎగిరిపడిపోయారని తెలిపారు. మరో మహిళ మాట్లాడుతూ.. హాస్పిటల్ కు వెల్లి ఇంటికి వెళ్లాలని చూస్తున్నాం. ఆటో ఎక్కుదామని వెళ్తుంటే అంతలోనే కారు చక్రం తన కాలు మీద నుంచి వెళ్లిందని ఆమె చెప్పారు.