Police arrest gang involved in GST scam worth hundreds of crores:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న  రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవస్థీకృత నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి వస్తువులు , సేవల సరఫరా లేకుండానే కేవలం కాగితాలపై  రూ. 1,472 కోట్ల విలువైన భారీ లావాదేవీలను సృష్టించి, తప్పుడు పద్ధతిలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 72 షెల్ కంపెనీల మాయాజాలం 

Continues below advertisement

ఈ భారీ స్కామ్ కోసం నిందితులు ఏకంగా  72 నకిలీ షెల్ కంపెనీలను సృష్టించారు. సాధారణ వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులను సేకరించి, వారికి తెలియకుండానే వారి పేరు మీద ఈ సంస్థలను రిజిస్టర్ చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించని చిన్న గదులు, మూసివేసిన షాపులను అద్దెకు తీసుకుని, నకిలీ అద్దె ఒప్పందాలు, యుటిలిటీ బిల్లులతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందారు. ఈ సంస్థల మధ్యే పరస్పరం తప్పుడు ఇన్వాయిస్‌లను మార్పిడి చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు.

 నిందితుల అరెస్ట్ - కీలక సూత్రధారి పరారీ 

Continues below advertisement

ఈ కేసులో ప్రధానంగా  సిద్ధగోని ప్రభాకర్ , రామావత్ నాగరాజు నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను డీజీజీఐ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిలో నాగరాజు నాయక్ నకిలీ పత్రాలు సృష్టించడం, డమ్మీ యజమానులను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించగా, ప్రభాకర్ రిజిస్ట్రేషన్లు , బయోమెట్రిక్ ప్రక్రియలను సమన్వయం చేసేవాడు. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న  ధంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి  ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అధికారులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

 డేటా అనలిటిక్స్‌తో గుట్టు రట్టు                                           

అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్ ,రిస్క్ ప్రొఫైలింగ్ ద్వారా ఈ భారీ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. కొన్ని సంస్థల జీఎస్టీ ఫైలింగ్‌లో అసాధారణ మార్పులు గమనించిన విశాఖపట్నం డీజీజీఐ జోనల్ యూనిట్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. విచారణలో ఆ సంస్థల పేరిట జరుగుతున్న వ్యాపారానికి, వాస్తవానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారులు                       

నిందితులపై సెంట్రల్ జీఎస్టీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం ద్వారా లబ్ధి పొందిన ఇతర కంపెనీలు, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల సీజింగ్ , తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇలాంటి ఫేక్ ఐటీసీ రాకెట్లపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.