BJP is giving a stronger contest in Kerala:  దశాబ్దాలుగా కేరళ రాజకీయ క్షేత్రం ఒక నిర్దిష్టమైన కూటముల మధ్య పోరులా సాగుతూ వస్తోంది.  అయితే  లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ( LDF )  లేకపోతే యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ( UDF ) మధ్య సాగే ఈ  అధికార మార్పిడి రాజకీయం ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. జాతీయ రాజకీయాల్లో వస్తున్న పరిణామాలు, మారుతున్న యువత ఆకాంక్షలు కేరళలో మూడో ప్రత్యామ్నాయం వైపు చూపులు మళ్లేలా చేస్తున్నాయి.

రెండు కూటముల రాజకీయాలకు సవాలు 

కేరళ ఓటర్లు పరంపరగా ఒకసారి వామపక్షాలకు, మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది.  అభివృద్ధి, పారదర్శకత  ప్రధాన అజెండాగా ముందుకు వస్తోంది. ముఖ్యంగా  NDA వంటి  జాతీయ స్థాయి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండటం, సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది.

 యువ నాయకత్వం - ఒక కొత్త ఆశాకిరణం 

ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు  యువ నాయకత్వానికి  పెరుగుతున్న ఆదరణ. పాత తరం నాయకులు, క్లిష్టమైన సిద్ధాంతాల కంటే.. తక్షణ సమస్యలను పరిష్కరించే, ప్రజలకు అందుబాటులో ఉండే యువ రక్తం వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.  ఎర్నాకులం జిల్లాలోని కలమస్సేరి వంటి పారిశ్రామిక కేంద్రాల్లో మారుతున్న వాతావరణమే ఇందుకు నిదర్శనం. ఇక్కడ విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చిన వారు, యువజన సంఘాల నేతలు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి  ఎన్నికల ఇంచార్జులుగా పని చేస్తున్న నేతలు చెబుతున్నారు. ఎర్నాకులం జిల్లాకు ఇంచార్జ్ గా ఉన్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి జోరుగా చేస్తున్న ప్రచారంలో తాను ఈ మార్పును గమనించానని సోషల్మీడియాలో చెప్పారు. 

భావోద్వేగాలు కాదు.. ఆలోచించే ఓటర్లు విద్యావంతులైన యువత ఉపాధి అవకాశాల కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం తహతహలాడుతున్నారు. ఎవరైతే ఈ హామీలను ఆచరణలో చూపిస్తారో వారికే పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ కావడంతో, ఓటర్లు భావోద్వేగాల కంటే  విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  అవినీతి రహిత పాలన మరియు పారిశ్రామిక వృద్ధిని కాంక్షించే విద్యావంతులైన ఓటర్లు, ఈసారి పార్టీల కంటే అభ్యర్థుల సామర్థ్యాన్ని, వారి గత చరిత్రను బేరీజు వేస్తున్నారు. 

 కొత్త శకానికి నాంది 

కేరళ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రమే పరిమితం కావు. ఇది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచి. సంప్రదాయ కూటములు తమ పట్టు నిలుపుకుంటాయా? లేక అభివృద్ధిని అజెండాగా మార్చుకున్న కొత్త శక్తులు పాగా వేస్తాయా? అనేది వేచి చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం.. కేరళ రాజకీయాల్లో యువత , అభివృద్ధి అనే అంశాలే ఈసారి కింగ్ మేకర్లుగా మారబోతున్నాయి.