Gold seized at Shamshabad airport:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులపై అనుమానం వచ్చి చెక్ చేయగా వారి వద్ద స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని గుర్తించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా మొత్తం 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు లో దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఎనిమిది కిలోల బంగారాన్ని ఎవరి కంటపడకుండా పలువురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనికీ చేసిన కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద నుంచి 2.17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ గాంధీ దొంతి తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.78 కేజీల బంగారం, అదే విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మరో ప్యాసింజర్ వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుంచి 2 కేజీల బంగారం కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు వ్యక్తుల నుంచి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం విలువ దాదాపు ఐదు కోట్లు ఉంటుందని సమాచారం. గతంలో ఇలాగే చేశారా, ఇంకా వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వీరి గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు.