Gold Seized at Miryalaguda city in Nalgonda district: నల్గొండ: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా నగదు, మద్యం తరలింపు జరుగుతుందా అని తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ వద్ద వాహన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది. ఈ బంగారం విలువ దాదాపు రూ.5.73 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. ఉదయం 11.30 గంటల సమయంలో మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఆపి చెక్ చేయగా, బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారం, వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
టీ షాప్ ఓనర్ వద్ద రూ.1.5 లక్షలు లంచం.. అధికారి అరెస్ట్
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్న ఓ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు టీపాయింట్ బోర్డు తొలగించకుండా ఉండేందుకు రూ. 1.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. సరిగ్గా లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఆయనకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు తనను లంచం డిమాండ్ చేయడంతో టీ షాపు నిర్వాహకుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసి అధికారిని, మరొకర్ని అరెస్ట్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.