Gold Seized: విదేశాల నుంచి బంగారం దొంగతనంగా తీసుకొచ్చేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టమ్స్‌ అధికారుల కళ్లు గప్పేందుకు స్మగ్లర్స్‌ వేసే ఐడియాలు మామూలుగా ఉండట్లేవు. అధికారుల ఎబిలిటీకే పరీక్ష పెట్టేలా ఉంటున్నాయి. ఇలాంటి ఐడియాలు అసలు ఎలా వస్తాయో కానీ.. ఒక్కో కేసు చూస్తుంటే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. కొందరు బంగారాన్ని పేస్ట్‌ రూపంలో మార్చి తీసుకువస్తుంటే, మరికొందరు బొమ్మలలో, విగ్గులు, స్పోర్ట్స్‌ బ్రాలు, ఇన్నర్‌ వేర్స్‌, ట్రాలీ బ్యాగ్స్‌ వెనక, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో చిన్న చిన్న ముక్కలుగా మార్చి స్మగుల్‌ చేస్తున్నారు. ఇంకా శరీరంలోపల దాచుకుని స్మగ్లింగ్‌ చేసే వాళ్లూ ఉన్నారు. ఇటీవల దిల్లీలో ట్రాలీ బ్యాక్‌ ప్యానెల్‌లో 5 కేజీల బంగారాన్ని దాచి తీసుకువస్తూ పట్టుబడ్డారు.


 తాజాగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మరో స్మగ్లింగ్‌ను బట్ట బయలు చేశారు. బంగారు ఆభరణాలకు రోడియం కోటింగ్‌ వేసి దర్జాగా తీసుకు వస్తున్నారు. కానీ ఎట్టకేలకు కస్టమ్స్‌కు చిక్కారు. స్మగ్లర్‌ను పట్టుకుని దాదాపు రూ.21 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు గుర్తు పట్టకుండా ఉండేందుకు బంగారానికి రేడియం కోటింగ్‌ చేసి మోసం చేయాలనుకున్నారు


యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సోమవారం కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెయిర్‌ క్లిప్స్‌, రింగ్స్‌, ఇతర ఆభరణాల రూపంలో ఉన్న బంగారానికి పైన రోడియంతో కోటింగ్‌ చేశారు. వీటితో పాటు ప్రయాణికుడి బ్యాగులో 22 క్యారెట్‌, 18 క్యారెట్స్‌లో గోల్డ్‌ గాజులను గుర్తించారు. హైదరాబాద్‌ జీఎస్‌టీ అండ్‌ కస్టమ్స్ జోన్‌కు సంబంధించిన ట్విట్టర్‌ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. దాదాపు రూ.20.59 లక్షల విలువై 397 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


బంగారాన్ని రోడియం కోటింగ్‌తో దాచి ఉంచారని, కోటింగ్‌ చేసిన హెయిర్‌ క్లిప్‌లు,రింగ్‌లతో పాటు ఇతర ఆభరణాలు, 18 క్యారెట్‌, 22 క్యారెట్‌ గోల్డ్‌ గాజులు కూడా లభించాయని, తర్వాతి దర్యాప్తు జరుగుతోందని సీజీఎస్‌టీ మరో ట్వీట్‌లో పేర్కొంది. రోడియం కోటింగ్‌ను ముఖ్యంగా వైట్‌ గోల్డ్‌ జ్యువలెరీకి వాడుతారు. రోడియంను ఆభరణంపై ఒక పలుచని లేయర్‌లాగా వేస్తారు. దీని వల్ల నగలపై స్క్రాచెస్‌ పడకుండా ఉంచుతుంది. అలాగే షైనింగ్‌గా కనిపించేలా వైట్‌ ఫినిష్‌ వస్తుంది.  


ఇటీవల దిల్లీ విమానాశ్రయంలో అధికారులు ఏకంగా 5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఉజ్‌బెకిస్థాన్‌కు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు అధికారుల కళ్లు గప్పేందుకు ట్రాలీ బ్యాకె ప్యానెల్‌లో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా దొరికిపోయారు. ఈ గోల్డ్‌ విలువ దాదాపు రూ.2.92 కోట్లు. 50 గోల్డ్‌ చెయిన్స్‌తో ఉన్న బాక్స్‌ను బ్యాగేజ్‌ ట్రాలీ బ్యాక్‌ పానెల్‌కు అతికించి తీసుకువచ్చారు. కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మే 16 న హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. జెడ్డా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడు 403 గ్రాముల బంగారాన్ని తీసుకువచ్చి అధికారులకు పట్టుబడ్డాడు. దీని విలువ కూడా రూ.21 లక్షలకు పైగా ఉంటుంది.