Vijayawada Gold Smuggling: 


అధికారులు ఎంత అలర్ట్ గా ఉన్నా కేటుగాళ్లు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా తీసుకురావడం, విదేశీ కరెన్సీ మార్పిడి ముఠాలను అధికారులు హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారును అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారంతో పాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.


చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారు..
విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు రూ. 6.4 కోట్ల విలువైన 11 కేజీల బంగారం, కువైట్, ఖతర్, ఒమన్‌కు చెందిన రూ.1.5 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25 తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. బంగారం దుబాయ్, శ్రీలంక నుంచి తీసుకొచ్చినట్టు తెలిపారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారును బోపల్లి టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్న అధికారులు 4.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని సోదా చేయగా 6.8 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 1.5 లక్షల విలువైన కువైట్ దీనార్, ఒమన్ రియాల్, ఖతర్ రియాల్ బయటపడ్డాయి.


నిందితుడికి 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
స్మగ్లింగ్ బంగారం కాదని మభ్యపెట్టేందుకు దానిపై ఉన్న విదేశీ గుర్తులను చెరిపివేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిని విశాఖపట్టణం కోర్టు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు 2022-23, 2023-24లో దాదాపు రూ. 40 కోట్ల విలువైన 70 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


ఇదే నెలలో శంషాబాద్ లో పెద్దఎత్తున బంగారం పట్టివేత.. 
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు రెండు వారాల కిందట స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులపై అనుమానం వచ్చి చెక్ చేయగా వారి వద్ద స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని గుర్తించారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున  అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా మొత్తం 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు లో దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు.


ఎనిమిది కిలోల బంగారాన్ని ఎవరి కంటపడకుండా పలువురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనికీ చేసిన కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద నుంచి 2.17 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ గాంధీ దొంతి తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.78 కేజీల బంగారం, అదే విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మరో ప్యాసింజర్ వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.


దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద నుంచి 2 కేజీల బంగారం కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు వ్యక్తుల నుంచి 8 కిలోల  బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం విలువ దాదాపు ఐదు కోట్లు ఉంటుందని సమాచారం.