godavari district youth beaten to death goa hotel management: గోవాలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికి వెళ్లిన ఓ యువకుడ్ని గోవాలో హోటల్ నిర్వాహకులు కొట్టి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది మంది స్నేహితుల బృందం వెళ్లింది. డిసెంబర్ 31 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఫుడ్ రేట్లను రెండింతలు వేసి బిల్లు వేయడంతో ఇదేమని ఆ స్నేహితులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బందికి స్నేహితులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది మిత్ర బృందంలో ఒకరు అయిన రవితేజ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై రవితేజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు హోటల్ నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. రవితేజ మృదేహాన్ని గోవా నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రిలో తరలించారు. రవితేజ స్నేహితులు, బంధువులు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.
రేట్లు ఎక్కువ ఎందుకు వేశారని కొట్టి చంపేస్తారా అని రవితేజ కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారిని చులకునగా చూస్తున్నారని.. గోవా పోలీసులు కూడా రెస్టారెంట్ ఓనర్లను వెంటనే అరెస్టు చేయలేదని అంటున్నారు. న్యూ ఇయర్ ని సరదాగా ఎంజాయ్ చేద్దామని గోవాకు వెళ్తే కొట్టి చంపడం ఏమిటన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. గోవాలో రెస్టారెంట్ ఓనర్లు అంతా ఓ మాఫియా ఏర్పడ్డారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తరచూ పర్యాటకలతో వారు ఘర్షణ పడుతున్న కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఆ వ్యాపారులు లోకల్ కావడం.. పర్యాటకులు ఎప్పుడో ఓ సారి వచ్చే వారు కావడంతో పోలీసులు వ్యాపారులకే మద్దతుగా నిలుస్తున్నారు.
పోలీసుల అండ చూసుకుని హోటల్ వ్యాపారులు మరింతగా రెచ్చిపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజను దారుణంగా కొట్టి చంపినా పోలీసుల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని గోవా ప్రభుత్వంతో మాట్లాడి రవితేజ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.