Ghaziabad Accident: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ - మీరట్ ఎక్స్‌ ప్రెస్‌ పై ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు టీయూవీ జీపును ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను, క్షతగాత్రులను గంట పాటు శ్రమించి బయటకు తీశారు. వెంటనే వారందరినీ ప్రభుత్వ ఆసుప్తరికి తీసుకెళ్లారు. క్షతగాత్రుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  









సంతాపం వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్


స్కూల్ బస్సు డ్రైవర్ ఢిల్లీలోని ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్ లో బస్సును తీసుకు వెళ్తుండగా... మీరట్ నుంచి గురుగ్రామ్ కు వెళ్తున్న కారను ఢీకొట్టినట్లు పోలీసులు వివరించారు. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసిన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారు, చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. విషయం తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని.. మెరుగైన వైద్య చికిత్స అందేలా చూసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.