Geetanjali Suicide due to social media trolling: గుంటూరు: తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహిత మరణంపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ (Guntur SP Tushar Dudi) క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎస్పీ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. గీతాంజలి(32)ది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. మార్చి 7న ఉదయం 11 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం 5 మీదకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు గీతాంజలి ఎదురుగా వెళ్లగా, గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. కానీ ఆమె తలకు గాయం కావడంతో జీజీహెచ్ గుంటూరుకు అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 11న 2 గంటలకు ఆమె చనిపోయింది. 




గీతాంజలి ఆత్మహత్యకు కారణం ఇదే.. 
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, పోస్టింగ్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని రైల్వే పోలీసుల విచారణలో తేలిందని గుంటూరు ఎస్పీ తుషార్ వెల్లడించారు. తమకు అందిన సమాచారంతో అసహజ మరణంగా భావించి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రైల్వే ఎస్సై సరస్వతి ఈ కేసు విచారణ చేపట్టగా.. గీతాంజలి మార్చి 4న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో తన సంతోషం వ్యక్తం చేస్తూ ఓ మీడియాతో మాట్లాడింది. ప్రభుత్వం నుంచి తనకు ఇళ్లు వచ్చిందని, జగనన్న అమ్మఒడి వస్తుందని, డబ్బులతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సైతం చేశానని ఆమె చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులు, అసభ్యకరమైన పదజాలం వాడకం, దారుణమైన ట్రోలింగ్ కు గురైన ఆమె మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని గుంటూరు ఎస్పీ తుషార్ వివరించారు. ఆమె కుటుంబసభ్యులను సైతం దారుణమైన పదజాలంతో, కామెంట్లతో హింసించారని రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. 


తెనాలి వన్ టౌన్ పీఎస్‌కు కేసు బదిలీ 
రైల్వే పోలీసులు గీతాంజలి మృతి కేసును తెనాలి వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని ఎస్పీ తుషార్ తెలిపారు. అక్కడ ఎఫ్ఐఆర్ అల్టర్ చేశామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు, వారు తెలిపిన సమాచారం మేరకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మహిళల భద్రతకు పోలీసులు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని, వారిపై ఎలాంటి హింసకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. చిన్నారులు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. కానీ సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.



డిజిటల్ పుట్ ప్రింట్స్, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఆమెపై అసభ్యకర పోస్టులు పెట్టిన కొన్ని ఒరిజినల్ సోషల్ మీడియా ఐడీలు, ఫేక్ ఐడీలను సైతం తాము గుర్తించామని తెలిపారు.  గీతాంజలిని వేధించిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సైబర్ వేధింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, ఎవరికీ ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. గీతాంజలి చనిపోవడం బాధాకరం అన్నారు. ఆమెకు సంతానం తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు.


Also Read: గీతాంజలి ఫ్యామిలీకి భారీ పరిహారం, సీఎం జగన్ ప్రకటన